“మనది సంక్షేమ రాజ్యం. అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తుంది. అందరినీ ఆదుకుంటుంది.“ అని పదే పదే చెబుతున్న సీఎం జగన్కు.. కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గృహ నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం కోసం.. వెచ్చిస్తున్న నిధుల వివరాలను తాజాగా వెల్లడించింది. కేంద్రం గృహ నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఇస్తున్న నిధులను కూడా జగన్ ప్రభుత్వం దారి మళ్లిస్తున్నట్టు పేర్కొంది.
ఇదేసమయంలో ఈ నిధులను పక్కాగా కార్మికుల కోసం ఖర్చు పెడుతున్న రాష్ట్రాల జాబితాను కూడా వెలువరించింది. దీనిలో కమ్యూనిస్టు పాలిత కేరళ రాష్ట్రం ముందువరుసలో ఉండడం గమనార్హం. కార్మికులను ఆదుకోవడంలో సిపిఎం అధికారంలో ఉన్న కేరళ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆదర్శంగా నిలిచింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉన్న నిధుల కంటే రెట్టింపు స్థాయిలో అదనపు నిధులను ఖర్చు చేసిన కేరళ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్రం స్పస్టం చేసింది.
భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పన్ను చట్టం ప్రకారం ఆయా రాష్ట్రాల్లో రోడ్లు,భవనాల నిర్మాణ దారులు,కంపెనీల నుంచి ఒక శాతం పన్ను వసూలు చేయాలి. వీటిని భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుల ద్వారా ఆయా రాష్ట్రాల కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ఖర్చు చేయాలి. కేరళ రాష్ట్రంలో 20,45,538 మంది కార్మికులు ఆ రాష్ట్ర భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో సభ్యులుగా ఉన్నారు.
కేరళ సంక్షేమ బోర్డుకు పన్నుల రూపంలో రూ.2,740.95 కోట్ల నిధులు వచ్చాయి.ఈ నిధులతో పాటు కేరళ ప్రభుత్వం అదనంగా రూ.1,648.83 కోట్లు కలిపి మొత్తం రూ.4,399.78 కోట్లను కార్మికుల కోసం ఖర్చు చేసింది. కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించినా, అంగ వైకల్యం కలిగినా రూ.5 లక్షల వరకు బీమా కల్పించాలి. కార్మికుల ఆరోగ్యానికి, కార్మికుల ఆడపిల్ల ల పెళ్లి ఖర్చులు, మెటర్నటీ, పిల్లల చదువుల కోసం బోర్డు నుంచి ఆర్థికసాయం అందించాలి. కార్మికుల ఇంటి నిర్మాణం కోసం రుణాలు అందించాలి. 60 ఏళ్లు దాటిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కూడా చట్ట ప్రకారం కల్పించాలి.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల బోర్డుల్లో మొత్తం రూ.87,478 కోట్ల నిధులు ఉన్నాయి. అయితే ఇందులో రూ.49,269 కోట్లు మాత్రమే రాష్ట్రాలు కార్మికుల కోసం ఖర్చు చేశాయని కేంద్రం స్పష్టం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా కార్మికుల సంక్షేమానికి వెచ్చించిన పాపాన పోలేదు. బిజెపి అధికారంలో ఉన్న గోవా, ఉత్తరప్రదేశ్, త్రిపురలోనూ ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని కేంద్రం దుయ్యబట్టింది.
అంతేకాదు.. గడిచిననాలుగేళ్లలో రాష్ట్రంలో 20 శాతంలోపే నూతన నిర్మాణాలు జరిగాయని.. ఫలితంగా కార్మికులు రోడ్డున పడ్డారని కేంద్రం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పదే పదే చెబుతున్నారు. రాష్ట్రంలో కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని.. ఇసుక లభించడం లేదని, సిమెంటు ధరలు పెరిగిపోయాయని.. దీంతో గృహ నిర్మాణ రంగం తీవ్రస్థాయిలో దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్రం కూడా ఇదే విషయాన్ని వివరించడం గమనార్హం.