ఆంధ్రప్రదేశ్ లో చేనేత కార్మికులు అష్ట కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఎంతో కళాత్మకంగా వస్త్రాలను తయారు చేస్తున్న చేనేతలకు సరైన గిట్టుబాటు ధర లేక నష్టాల పాలవుతున్న వైనం చర్చనీయాంశమైంది. వైసీపీ పాలనలో చేనేతలకు స్వర్ణ యుగం వస్తుందని, చేనేతల అభివృద్ధికి పాటుపడతామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చి సీఎం అయిన తర్వాత వారికి రిక్త హస్తాలు చూపించారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే చేనేతలను ఆదుకునేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని లక్షలాది చేనేత కార్మికుల బంగారు భవితకు లోకేష్ బాట వేశారు. చేనేత కార్మికుల కోసం weaversdirect.in వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాజెక్టుకు నారా లోకేష్ కర్త, కర్మ, క్రియ. ఈ ప్రాజెక్టుకు ఎన్నారైలు శాంతి నరిశెట్టి, మాధవి మార్త, అనురాధలు సహాయ సహకారాలు అందించారని వారికి లోకేష్ కృతజ్ఞతలు చెప్పారు. మంగళగిరిలో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని చేపట్టామని ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఇదే ప్రణాళిక అమలు చేస్తామని లోకేష్ అన్నారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎంతోమంది చేనేతరంగానికి దూరం అవుతున్నారని, వారిని చేనేత వృత్తి వైపు మరలేలా చేయడమే తన లక్ష్యమని లోకేష్ చెప్పారు. ప్రస్తుతం వెంకటగిరిలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళగిరిలో 30 వేల మంది చేనేత కార్మికులున్నారని, వారి కష్టనష్టాలు, సమస్యలు తెలుసుకున్నామని లోకేష్ అన్నారు. కొత్త టెక్నాలజీ చేనేత కార్మికులను అందిపుచ్చుకోవడం ద్వారా 30% ఉత్పత్తి పెరిగిందని, హై స్పీడ్ చరఖా, రాక్ లూమ్స్, మెకానిక్ లిఫ్టర్ వంటివి కార్మికులకు అందించామని చెప్పారు.
చేనేత డైయింగ్ కార్మికుల రక్షణ కోసం ప్రత్యేకమైన గ్లోవ్స్, బూట్లు సరఫరా చేశామని చెప్పారు. కేంద్ర సహకారంతో నడుస్తున్న వీవర్స్ సెంటర్ ద్వారా కొన్ని పనిముట్లు అందజేస్తే కార్మికులకు మరికొంత రక్షణ లభిస్తుందని అన్నారు. కష్టపడి నేసిన చీరలు, దుస్తులు దళారుల చేతికి చిక్కుతున్నాయని, కార్మికులకు నష్టం వస్తుందని లోకేష్ అన్నారు. అందుకే డైరెక్ట్ గా చేనేత కార్మికులు తమ ఉత్పత్తులు అమ్ముకునే విధంగా కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. ప్రపంచంలో ఏ మూల నుంచైనా మంగళగిరి చేనేత చీరలు, వస్త్రాలు weaversdirect.in ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చని, చేనేత కార్మికుల నుంచే నేరుగా కొనుక్కోవచ్చని లోకేష్ తెలిపారు.