భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ ఓపెనింగ్స్ అదిరేలా ఉన్నప్పటికీ.. దర్శకుడు ఓంరౌత్ చేసిన పుణ్యమా అని.. ఈ సినిమాపై ఇప్పుడు లెక్కలేనన్ని విమర్శలు వస్తున్నాయి. సినిమాను చూసి బయటకు వచ్చిన వారిలో అత్యధికులు పెదవి విరవటం.. తమకు తెలిసిన రామాయాణాన్ని ఇలా తీయటమా?అంటూ ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా.. ఆదిపురుష్ మూవీ ఎపిసోడ్ లో బోనులో నిలబడింది చిత్ర దర్శకుడు ఓంరౌత్. అయితే.. ఈ మూవీని ప్రభాస్ ఎలా చేస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే.. ఈ సినిమా విషయంలో ప్రభాస్ అనుమానం నిజమైందన్న విషయాన్ని పలువురు చెబుతున్నారు. ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ అంచనా నిజమైందని.. అతను అనుమానపడిందే జరిగిందంటున్నారు. ఇందుకు సాక్ష్యంగా పాత వీడియోను సరికొత్తగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అందులో ప్రభాస్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు అతడ్ని విమర్శల నుంచి తప్పించేలా చేస్తున్నాయని చెప్పాలి.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పాత వీడియోలో ప్రభాస్ ‘ఆదిపురుష్’ గురించి మాట్లాడుతూ..ఆ సినిమాపై తనకున్న సందేహాల్ని ఇంటర్వ్యూలో పంచుకోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అప్పట్లో ఆదిపురుష్ మీద ప్రభాస్ వ్యాఖ్యలు చాలామందికి అర్థం కాలేదు. ఆదిపురుష్ విడుదలై.. రచ్చ జరుగుతున్న వేళ.. డార్లింగ్ మాటల్లో నిజం ఇప్పుడు అందరికి కట్టిపడేస్తోంది.
రాధేశ్యామ్ చిత్ర విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్స్ వేళ.. ఆదిపురుష్ గురించి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ప్రభాస్.. ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. ఆదిపురుష్ సినిమా షూటింగ్ వేళలో జరిగిన ఉదంతం ప్రస్తావిస్తూ.. ‘‘నాలుగు రోజులు షూటింగ్ పూర్తి అయిన తర్వాత నేను పోషిస్తున్న రాఘవుడి పాత్ర మీద అనుమానం వచ్చింది.
దర్శకుడు ఓంరౌత్ ను పిలిచి.. నేను సినిమా చేయొచ్చా? అని అడిగా. ఎందుకంటే అంతకుముందు అలాంటి సినిమాను.. ఆ తరహా పాత్రను చేయలేదు. ఇతర సినిమాల విషయంలో తప్పు జరిగినా ఫర్లేదు. ఆదిపురుష్ విషయంలో తప్పు జరగకూడదు.అందుకే ఓంరౌత్ ను మళ్లీ పిలిచి.. ఈ సినిమా చేయొచ్చా? అని అడిగితే.. ఎలాంటి భయాలో పెట్టుకోవద్దన్నాడు. నేనున్నానని భరోసా ఇచ్చారు’’ అంటూ ఓంరౌత్ తో తనకు జరిగిన సంభాషణను అప్పట్లో వెల్లడించారు.
అయితే.. రాధే శ్యామ్ సినిమా హడావుడితో పాటు.. ఆదిపురుష్ మూవీ మీద అంతగా అవగాహన లేకపోవటంతో.. ప్రభాస్ అనుమానాల్ని అంతలా పట్టించుకోలేదన్న మాట వినిపిస్తోంది. సినిమా షూటింగ్ మొదలుపెట్టిన నాలుగు రోజులకే ప్రభాస్ కు అర్థమైన విషయం.. దర్శకుడు ఓంరౌత్ కు అర్థం కాలేదంటూ పలువురు విరుచుకుపడుతున్నారు. తాము మొదట్నించి చెబుతున్నట్లే.. ఆదిపురుష్ పాపమంతా దర్శకుడిదేనని తేల్చేస్తున్నారు. చిత్ర హీరో ముందే హెచ్చరించినా.. ఓవర్ కాన్ఫిడెన్స్ తో సినిమా తీసిన దర్శకుడు.. ఘోరమైన తప్పు చేశారన్న మాట సర్వత్రా వినిపిస్తోంది.