జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ రాసిన సంగతి తెలిసిందే. పవన్ వీధి రౌడీలా మాట్లాడడం సమంజసం కాదని ముద్రగడ అన్నారు.. రాజకీయ పార్టీ అధినేత అయిన పవన్ తాటతీస్తా, గుండు గీస్తా, కింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా అని మాట్లాడడం సరికాదంటూ హితవు పలికారు. వైసీపీ నేతలకు అనుకూలంగా పవన్ ను విమర్శిస్తూ ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. ముద్రగడకు వారు కౌంటర్ ఇస్తున్నారు.
ముద్రగడ లేఖపై జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు.. ముద్రగడ లేఖను, అందులో పవన్ కల్యాణ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. పవన్ ను, పవన్ కుటుంబ సభ్యులను ద్వారంపూడితో పాటు వైసీపీ నేతలు బూతులు తిట్టినప్పుడు ముద్రగడ ఎక్కడున్నారని, ఆయన ఎందుకు స్పందించలేదని కూసంపూడి ప్రశ్నించారు.
ఆనాడు వైసీపీ నేతల బూతులు ముద్రగడకు వినబడలేదా అని నిలదీశారు. ఇతరులను ప్రశ్నించడం, సలహాలు ఇవ్వడం ఆపేయాలని, మనమెంత బాధ్యతగా వ్యవహరిస్తున్నామో ఆలోచించుకోవాలని ముద్రగడకు హితవు పలికారు. ముద్రగడ వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. కాకినాడ ఎంపీగా వైసీపీ తరఫున ముద్రగడ పోటీ చేయబోతున్నారని, అందుకే ఆయన పవన్ పై ఇలా విమర్శలు చేశారని అంటున్నారు.