టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఓ వైపు ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతున్నప్పటికీ..మరోవైపు అదే రికార్డు స్థాయిలో ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతోంది. రామాయణం వంటి మైథలాజికల్ మూవీని సినిమాటిక్ లిబర్టీ తీసుకొని నాశనం చేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఇక, ఈ చిత్రంలో డైలాగులు రాసిన మనోజ్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
‘‘గుడ్డ నీ బాబుది.. తైలం నీ బాబుది.. మంట నీ బాబుది. కాలేది కూడా నీ బాబుదే’’.. పవిత్రంగా పూజించే హనుమంతుడితో ఈ డైలాగ్ ఎలా చెప్పించాలనిపించింది మనోజ్ అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. పౌరాణిక చిత్రంలో రాఘవుడు అని కాకుండా రాఘవ.. రాఘవ..అంటూ ఏదో లవ్ స్టోరీకి రాసినట్లు డైలాగులు రాసిన మహానుభావుడు మజోజ్ అని ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో, ఇది రామాయణం కాదని, రామాయణం నుంచి స్ఫూర్తి పొందామని మనోజ్ సమర్థించుకున్నారు. అటువంటపుడు హనుమంతుడి కోసం థియేటర్లలో సీట్ ఎందుకు వదిలారని నిలదీస్తున్నారు. రామాయణం కాకుంటే జై శ్రీరామ్ పాట సినిమాలో ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా మనోజ్ ను చంపేస్తామని వార్నింగ్ లు ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మనోజ్ తనకు ప్రాణహాని ఉందంటూ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో, మనోజ్ కు పోలీసు అధికారులు భద్రత కల్పించారు. అయితే, తాను రాసిన డైలాగులను మనోజ్ సమర్థించుకున్నారు. ఆ డైలాగులలో తప్పులేదని తాను నిరూపించుకోగలరని, కానీ, అందరి మనోభావాలను పరిగణలోకి తీసుకొని కొన్ని డైలాగులను మార్చాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారని మనోజ్ చెప్పారు. కొత్తగా రాసిన డైలాగులను ఈ వారంలో సినిమాలో చేరుస్తామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.