నెల్లూరు జిల్లా కావలిలో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. వడ్డీ పేరుతో అప్పు కట్టలేదంటూ భర్త మరణించిన మహిళ పార్వతిపై స్థానిక రౌడీషీటర్.. వైసీపీకి చెందిన యువ నాయకుడిగా చెప్పుకునే దర్శిగుంట మహేంద్ర అతని అనుచరుల దాడి ఇప్పుడు సంచలనంగా మారింది. కావలి పట్టణంలో హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతం లోతుల్లోకి వెళితే.. బయటకు వచ్చే అంశాలన్నీ అవాక్కు అయ్యేలా చేస్తాయి. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే అవకాశం లేదంటూ ఆవేదనతో పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన పార్వతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
స్థానికంగా అందుతున్న సమచారం ప్రకారం దర్శిగుంట మహేంద్ర కుటుంబం వద్ద ఏడాది క్రితం రూ50వేల మొత్తాన్ని రూ.20 వడ్డీకి అప్పు తీసుకుంది కరకమిట్ట పార్వతి. అయితే.. ఆమె మాత్రం తాను రూ.50వేలు అప్పు తీసుకున్నా.. మొదట చెప్పిన వడ్డీకి.. ఇప్పుడు చెబుతున్న వడ్డీకి సంబంధం లేదని చెబుతోంది. కావలిలోని షాదీమంజిల్ సమీపంలో కిరాణా షాపు నిర్వహిస్తోంది. అసలు రూ50వేలు.. వడ్డీ కింద మరో రూ.50వేలు చెల్లించినా.. మరో రూ.65వేలు అప్పు ఉన్నట్లుగా పేర్కొంటూ మహేంద్ర.. మరో ఏడుగురు మద్యం మత్తులో ఆమె షాపు వద్దకు వచ్చి నానా హంగామా చేశారు.
అసభ్య పదజాలంతో దూషించటంతోపాటు.. జుట్టుపట్టుకొని రక్తస్రావమయ్యేలా కొట్టారు. వారు కొడుతున్న వేళ అడ్డుగా వచ్చిన బాధితురాలి తల్లి.. కొడుకుపైనా దౌర్జన్యం చేసి.. షాపు వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా ఫోన్లలో రికార్డు చేసేందుకు వీల్లేని రీతిలో.. అక్కడ ఉన్న వారందరి నుంచి సెల్ ఫోన్లు తీసేసుకోవటం.. అక్కడి సీసీ కెమేరాలు పని చేయకుండా చేసి మరీ దౌర్జన్యం చేయటం గమనార్హం. ఒకరి సీసీ కెమేరాలో జరిగిన ఉదంతం మొత్తం రికార్డు అయిందన్న విషయాన్ని తెలుసుకొని.. దాన్ని సైతం డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది.
కావలి ఫ్రూట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మహేంద్ర ఆరాచకాలకు అడ్డు లేకుండా పోయిందంటున్నారు. పార్వతిపై దాడి సందర్భంగా.. ‘‘ఏ పోలీసు వస్తాడో చూస్తా.. మీ ఇంటి దగ్గరకు వచ్చి కొడతా.. నువ్వేం చేస్తావ్? నన్నెవరూ ఏమీ చేయలేరు’’ అంటూ విరుచుకుపడినట్లుగా చెబుతున్నారు. తనపై దాడి చేసే సమయంలో మహేంద్ర.. అతడి అనుచరులు మద్యం మత్తులో ఉన్నారని.. ఊరంతా తన అడ్డా అని.. తన దందా ఇదేనని.. తన రాజకీయం ఇదేనంటూ బెదిరింపులకు దిగినట్లుగా బాధితురాలు వాపోతోంది.
దారుణంగా తిట్టేస్తూ.. ఒంటిపై చీర ఊడిపోయేలా కొట్టారని.. తన బిడ్డను కూడా చావబాదిన వైనాన్ని చెబుతూ.. ‘‘మీ అమ్మని కొడుతున్నాం చూడరా అంటూ గొంతు పట్టుకొని చిత్రహింసలు పెట్టారు.వడ్డీ అసలు చెల్లించినా వేధిస్తున్నారు. అప్పు తీసుకున్న పాపానికి నా రక్తం పిండుకుని తాగారు. రూ.20 వడ్డీ చెల్లించాలని అంటున్నారు. పోలీస్ స్టేషన్ కు వెళతామని మా ఫోన్లు.. బండి తాళాలు పెరుక్కున్నారు. భర్త చనిపోయినా పరువుగా బతుకుతున్నా. మహేంద్ర అక్క దగ్గర అప్పు తీసుకున్నానని భారీగా వడ్డీ వసూలు చేశారు. అంతా కట్టాను. అయినా.. ఇంకా కట్టాలంటున్నారు. నా వల్ల కాదు.ఈ బతుకు దేనికి? చావటం మేలు. ఏ పోలీసు వస్తాడో చూస్తానని వార్నింగ్ఇచ్చాడు. పోలీసుల దగ్గర న్యాయం జరగదని నాకు తెలుస్తోంది. అందుకు చచ్చిపోతున్నా’’ అంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది పార్వతి. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.