‘ఆదిపురుష్’ తర్వాత తెలుగులో రానున్న చిత్రాల్లో ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తున్నది ‘స్పై’నే. ‘కార్తికేయ-2’తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్, మార్కెట్ సంపాదించిన నిఖిల్ సిద్దార్థ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించడం.. ‘కార్తికేయ-2’ మాదిరే ఇందులోనూ వివిధ భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశం ఉండటం దీనికి ప్లస్. ఈ సినిమా టీజర్‌కు వివిధ భాషల్లో మంచి స్పందన వచ్చింది.
నిఖిల్‌కు మరో పాన్ ఇండియా హిట్ పడబోతోందనే అంచనాలు కలిగాయి. టీజర్‌కు వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకుని ప్రమోషన్లు గట్టిగా చేస్తే ఓపెనింగ్స్ కూడా బాగుంటాయని అనుకున్నారు. కానీ ఈ చిత్రానికి అనుకోని ఇబ్బందులు మొదలయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్లకు చాలినంత సమయం లేదంటూ హీరో నిఖిల్ సిద్దార్థ రిలీజ్ వాయిదా వేయాలని సూచించగా.. నిర్మాత రాజశేఖర్ రెడ్డి మాత్రం జూన్ 29నే విడుదల చేయాలని పట్టుబట్టి కూర్చున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఆ ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నట్లు కూడా గుసగుసలు వినిపించాయి.
ఈ వార్తల్ని నిజం చేస్తూ.. నిర్మాత తన పాటికి తాను సినిమాను సోషల్ మీడియాలో ప్రమోట్ చేయిస్తుంటే.. హీరో మాత్రం తనకు ఈ సినిమాకు సంబంధం లేనట్లే వ్యవహరిస్తున్నాడు. తన సినిమా చిన్నదైనా, పెద్దదైనా నిఖిల్ దాన్ని బాగా ఓన్ చేసుకుని గట్టిగా ప్రమోట్ చేస్తాడు. కార్తికేయ-2నే కాక 18 పేజెస్ మూవీని కూడా అతను ఎంత బాగా ప్రమోట్ చేశాడో తెలిసిందే. అలాంటిది గత నెల రోజులుగా నిఖిల్ నుంచి ‘స్పై’ సినిమాకు సంబంధించి ఒక్క ట్వీట్ కూడా లేదు.
పాట రిలీజ్ చేసినపుడు మాట్లాడలేదు. తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ మీదా రెస్పాన్స్ లేదు. ఇంకా మొదలే కాని ‘స్యయంభు’ సినిమా గురించే ట్వీట్లు వేస్తున్నాడు. ‘స్పై’ సినిమాకు సంబంధించి ఆకర్షణ మొత్తం నిఖిలే. హీరోయిన్ కొత్తమ్మాయి. దర్శక నిర్మాతలు కొత్త వాళ్లు. టీంలో ఇంకెవరూ పాపులర్ కాదు. అలాంటపుడు నిఖిలే ఈ సినిమాను భుజాన వేసుకుని ప్రమోట్ చేయలేదు.
అప్పుడే ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాంటిది హీరోనే పట్టనట్లు ఉంటే.. నిర్మాత అసలు సినిమాను ఎలా రిలీజ్ చేసుకుంటాడన్నది అర్థం కాని విషయం. సినిమా విడుదలకు ఇంకో పది రోజులే సమయం ఉంది. ఒకట్రెండు రోజుల్లో నిఖిల్‌తో సమస్య పరిష్కరించుకుని అతణ్ని రంగంలోకి అయినా దించాలి. లేదంటే సినిమాను వాయిదా అయినా వేసుకోవాలి. నిర్మాతకున్న ఆప్షన్ ఇదే.