తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ క్యాస్ట్ పై తీవ్రమైన వివాదం మొదలైంది. బీజేపీ అభ్యర్ధి ఎస్సీ కాదని క్రిస్తియన్ మైనారిటికి చెందిన ఆమె బీసీ (సీ) అని అంటున్నారు. ఈ మేరకు గతంలో హైదరాబాద్ లోని మియాపూర్ కు చెందిన ఏవి రమణ అనే వ్యక్తి గతంలోనే రత్నప్రభ క్యాస్ట్ వివాదంపై ఇచ్చిన ఫిర్యాదును ఇపుడు తవ్వి బయటకు తీస్తున్నారు.
తమ వాదన, ఆరోపణలకు మద్దతుగా రత్నప్రభ అత్తగారు గోన నవమణి సంస్మరణ సభ సందర్భంగా ముద్రించిన ఇన్విటేషన్ కార్డును చూపిస్తున్నారు. ఆ కార్డులో నవమణి కొడుకులు, కోడళ్ళ జాబితా ఉంది. అందులో చివరది, నాలుగో పేరుగా ఎడమవైపున విద్యాసాగర్ (ఐఏఎస్) అని, ఆ పేరుకు ఎదురుగా, కుడివైపున భార్యగా రత్నప్రభ అనుంది.
రత్నప్రభపై ఏవి రమణ ఇచ్చిన ఫిర్యాదు కూడా ఇప్పటిది కాదు. చాలా సంవత్సరాల క్రితమే ఆయన ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదుపై ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారో మాత్రం తెలియలేదు. భార్య, భర్తలు ఇద్దరు ఐఏఎస్ అధికారులే అయినపుడు వాళ్ళమీద ఎవరైనా ఫిర్యాదు చేసినా ఏమి యాక్షన్ ఉంటుంది ? అందుకనే ఫిర్యాదుపై యాక్షన్ గురించి ఎవరికీ తెలీదు.
అలాంటిది ఇంతకాలం తర్వాత అప్పటి ఫిర్యాదు కాపీ ఇపుడు వైరల్ గా మారింది. ఎందుకంటే ఇపుడు రత్నప్రభ బీజేపీ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో నిలబడ్డారు కాబట్టి. అంటే భర్త బీసీ అయినంత మాత్రాన భార్య కూడా బీసీ అవ్వాలనేమీలేదు. వాస్తవంగా రత్నప్రభ బీసీయేనా లేకపోతే ఎస్సీనా ? అనేది తేలాలి. ఏదేమైనా అభ్యర్ధి సామాజికవర్గంపై మొదలైన వివాదానికి రత్నప్రభ, బీజేపీ నేతలే సమాధానం చెప్పాల్సుంటుంది. మరి తాజా వివాదంపై దళిత హక్కుల సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.