జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ తో పాటు సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం విదితమే. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో రెండు చెప్పులు చూపించిన విషయం వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా నిన్న పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో పేర్ని నానికి పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు.
అన్నవరం గుడి బయట తన చెప్పులు కొట్టేశారని, అవి కొట్టేసిన వారిని పట్టుకోవాలని పేర్ని నానిపై పరోక్షంగా సెటైర్లు వేశారు. అవి తనకెంతో ఇష్టమైన చెప్పులని, దొరికితే తనకు తెచ్చి ఇవ్వాలని ఫ్యాన్స్ తో అన్నారు. ఆఖరికి చెప్పులు కొట్టేసే స్టేజీకి ఈ ప్రభుత్వం దిగజారిందని పవన్ చురకలంటించారు. ఇక, వైసీపీ నేతలు తనను దూషిస్తున్నారని, వారి దూషణలను తాను ఆహ్వానిస్తున్నానని పవన్ అన్నారు.
ఇక, ముఖ్యమంత్రి పదవిపై కూడా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా తాను ఎప్పుడూ ఈ విషయం చెప్పలేదని, కానీ, ఈసారి చెబుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని పవన్ స్పష్టం చేశారు. అయితే, కొద్ది రోజుల క్రితం సీఎం పదవి గురించి పవన్ చేసిన వ్యాఖ్యలకు, ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలకు పొంతన లేదని విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో జనసేనకు 20-25 సీట్లు వచ్చి ఉంటే సీఎం పదవి అడిగినా బాగుంటుందని, కానీ, ఒక్క సీటు గెలిచి సీఎం పదవి అడిగితే బాగుండదని పవన్ అన్న సంగతి తెలిసిందే.
దీంతో, పవన్ ఇచ్చిన రెండు స్టేట్ మెంట్లు అభిమానులను, జనసైనికులను గందరగోళంలో పడేసేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఏదో ఒక స్టాండ్ పై ఉంటే బాగుంటుందని, ఇలా పూటకో మాట చెప్పడం వల్ల విమర్శకులకు పవన్ స్వయంగా అవకాశం ఇచ్చినట్లుందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.