టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించిన చిత్రం ఆది పురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ పౌరాణిక చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటించగా, సీతగా కృతి సనన్ నటించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు భారీ స్థాయిలో విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంపై డివైడ్ టాక్ వస్తోంది. సినిమా బాగుందంటూ కొందరు అభిప్రాయపడుతుండగా మరికొందరు ఆశించిన స్థాయిలో సినిమా లేదని, సినిమా తమను నిరుత్సాహపరిచిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ చిత్రంపై ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు, ఈ సినిమాకు ఓవరాల్ గా తరుణ్ 1.5 రేటింగ్ ఇచ్చారు. భారీ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైందని, భారీ తారాగణం, బడ్జెట్ చేతిలో ఉన్నప్పటికీ ఈ సినిమాను గందరగోళంగా ఓమ్ తెరకెక్కించారని విమర్శించారు.
ఇక, ఈ సినిమా బాగోలేదంటూ విమర్శించిన ఒక ప్రేక్షకుడిపై హైదరాబాదులో ప్రభాస్ అభిమానులు దాడి చేయడం సంచలనం రేపింది. మరోవైపు, హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్ లో హనుమాన్ కోసం కేటాయించిన సీట్లో ఒక వ్యక్తి కూర్చోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఆ వ్యక్తిని పై వారు దాడికి పాల్పడ్డారు. మరోవైపు, ఈ సినిమా చూసేందుకు థియేటర్ లోకి ఒక వానరం వచ్చిన ఘటన వైరల్ గా మారింది.
ఏది ఏమైనా, ఆది పురుష్ చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ చిత్రం చిన్న పిల్లలు చూసుకునే 3డీ, యానిమేషన్ మూవీలా ఉందని, ట్రైలర్ లో చూపిన విధంగానే సినిమా అంతా కృతకంగా ఉందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.