వైసీపీ నేతలపై ప్రజలలో నానాటికీ వ్యతిరేకత పెరిగిపోతుందని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన వైసీపీ నేతలకు మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తమ నియోజకవర్గాలలో పర్యటించిన సందర్భంగా వారికి నిరసన సెగ తగిలింది. ఈ సారి ఏకంగా సీఎం జగన్ కి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. తాజాగా గుడివాడలో పర్యటిస్తున్న జగన్ కు జనం నుంచి నిరసన ఎదురైంది.
జగన్ వస్తున్న దారిలో నల్ల బెలూన్లు వదిలి మహిళలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ సీఎం సైకో సీఎం అంటూ మహిళలు నినాదాలు చేశారు. చంద్రబాబు కట్టించిన టిడ్కో ఇళ్ళను ప్రారంభించేందుకు జగన్ వచ్చారని మండిపడ్డారు. జగన్ వస్తోంది ఇళ్ల పట్టాల పంపిణీ కోసం కాదని, తన తండ్రి వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఆయన వచ్చారని ఆరోపించారు. ఈ క్రమంలోనే జగన్ పర్యటనకు నిరసనగా వందలాది మంది మహిళలు సభా స్థలానికి వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
దీంతో, జగన్ హెలికాప్టర్ ఆ ప్రాంతంలోకి వచ్చిన వెంటనే నల్ల బెలూన్లను మహిళలు ఎగరవేసి నిరసన వారు నిరసన వ్యక్తం చేశారు. ఇక, జగన్ పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేతలు ప్రజా సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం సంచలనం రేపుతోంది. మరోవైపు, యధావిధిగా జగన్ టూర్ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టడం, అడ్డొచ్చిన చెట్లను నరికి వేయడం, ఆ ప్రాంతంలోని దుకాణాలు మూసివేయడం వంటి కార్యక్రమాలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.