కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ కొద్ది నెలల క్రితం వరకు సఖ్యతగా ఉంటోన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు మొదలైన మైత్రి బంధం దాదాపుగా మూడున్నర ఏళ్ల పాటు బాగానే కొనసాగింది. అయితే, గత కొద్ది నెలలుగా బిజెపి, వైసీపీల మధ్య కొంత గ్యాప్ వచ్చిందని, ఇరు పార్టీలు తెగదెంపులు చేసుకునే పరిస్థితి వచ్చిందని ప్రచారం జరిగింది. ఇక, ఇటీవల విశాఖలో పర్యటించిన కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా… జగన్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ, వైసీపీల మధ్య ఉన్న స్నేహబంధం అధికారికంగా తెగిపోయింది.
సీఎం జగన్ తో పాటు, వైసీపీ ప్రభుత్వాన్ని అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శించడంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తమకు బిజెపి అండగా ఉండకపోవచ్చు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు సోము కౌంటర్ ఇచ్చారు. జగన్ ను బీజేపీ ఏనాడు సమర్థించలేదని, జగన్ కు అండగా బిజెపి ఎన్నడూ లేదని సోము సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంకా, గట్టిగా మాట్లాడితే వైసీపీతో బిజెపి ఎప్పుడు సఖ్యతగా ఉందో చెప్పాలంటూ జగన్ ను సోము నిలదీశారు. ఏపీలో జగన్ పాలనను, ఆయన అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలను బిజెపి ఎప్పటికప్పుడు ఎండగడుతోందని, ర్యాలీలు, సభలు ఆందోళనలు, నిరసనలు చేపట్టి ప్రజల పక్షాన నిలిచిందని సోము కామెంట్ చేశారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదంటూ సోము షాకింగ్ కామెంట్స్ చేయడం సంచలనం రేపుతోంది.
ఇక బీజేపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడని జగన్ ఎలా చెబుతారు అంటూ సోము నిలదీశారు. పవన్ బీజేపీతోనే ఉన్నారని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ గురించి వైసీపీ నేతలు ఎప్పుడూ మాట్లాడలేదని, వైసీపీని విమర్శించినప్పుడే ఇవన్నీ ఆ పార్టీ నేతలకు గుర్తుకు వస్తాయని సోము ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అంతులేని అవినీతి జరుగుతోందని, అధికార పార్టీకి చెందిన అవినీతి మంత్రులపై బీజేపీ తన పోరాటాన్ని గతంలో మాదిరిగానే కొనసాగిస్తుందని సోము స్పష్టం చేశారు.