టెన్నిస్ రంగంలో దిగ్గజ ఆటగాళ్లైన ఫెదరర్..నాదల్ లాంటి మొనగాళ్లైన ఆటగాళ్లకు సవాలు విసిరి మరి.. మైదానంలో తన సత్తా చాటే జకోవిచ్.. ఇప్పుడు ఏకంగా చరిత్రనే సృష్టించాడు. తాజాగా గెలుపుతో అతను టెన్నిస్ చరిత్రలో పురుషుల సింగిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకున్న మొనగాడిగా నిలిచాడు. పన్నెండేళ్ల వ్యవధిలో.. దిగ్గజాలకు కొరకరాని కొయ్యిగా మారి.. ఇప్పుడు ఏకంగా హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సెర్బియా టెన్నిస్ క్రీడాకారుడి గొప్పతనం ఎంతన్నది ఒక్క ఉదాహరణతో చెప్పేయొచ్చు.
2011 సీజన్ ఆరంభానికి ముందు వరకు టెన్నిస్ దిగ్గజాలైన ఫెదరర్ 16.. నాదల్ 9 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలిచి.. తమకు తిరుగులేదన్న పరిస్థితి ఉండేది. ఆ సమయానికి జకోవిచ్ మాత్రం నెగ్గింది ఒక్క టైటిల్ మాత్రమే. కట్ చేస్తే.. 2023 నాటికి ఫెదరర్.. నాదల్ సాధించిన టైటిళ్లను దాటేసి.. టెన్నిస్ ప్రపంచంలో అత్యధిక టైటిళ్లను గెలుచుకున్న క్రీడాకారుడిగా అవతరించాడు. 2018లోనూ ఫెదరర్ 20 టైటిళ్లు.. నాదల్ 17 టైటిళ్లతో ఉంటే.. జకోవిచ్ సాధించిన టైటిళ్లు కేవలం 12 మాత్రమే. కానీ..ఐదేళ్లలో సినిమా మొత్తం మారింది. అందులో కొవిడ్ టైం ఉంది. అది కూడా లేకుంటే.. ఈ రికార్డు మరింత ముందే ఆయన ఖాతాలోకి వచ్చి చేరేదేమో?
మిగిలిన ఆటగాళ్లకు భిన్నం జకోవిచ్. తన ఆటతోనే కాదు.. ఆటకు సంబంధం లేని విషయాల్లోనూ అతడి తీరు మిగిలిన వారికి భిన్నం. అదే జకోవిచ్ ను మిగిలిన వారికి ప్రత్యేకంగా మారుస్తుంది. అతడి కెరీర్ లో ఎత్తుపల్లాలు ఉంటాయి. సవాళ్లు ఎదురైన ప్రతిసారీ పోరాడి.. తనను తాను ఫ్రూవ్ చేసుకోవటమే కాదు.. తన వైపు వేలెత్తే వారికి తగిన సమాధానాన్ని ఇచ్చారు.
మొత్తం 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకున్న జకోవిచ్.. ఆస్ట్రేలియా ఓపెన్ లో 10, వింబుల్డన్ లో 7, యూఎస్ ఓపెన్ లో మూడు.. ఫ్రెంచ్ ఓపెన్ లోనూ మూడుసార్లు టైటిళ్లను సొంతం చేసుకున్నాడు. తాజా రికార్డును చూస్తే.. జకోవిచ్ తర్వాత అత్యధిక టైటిళ్లను సొంతం చేసుకున్న ఆటగాళ్లుగా నాదల్ 22, ఫెదరర్ 20 నిలుస్తారు. ఓవరాల్ టైటిళ్లలో 23 గ్రాండ్ స్లామ్ లను సొంతం చేసుకున్న సెరెనా రికార్డును సమం చేశారు.
అతడి ముందున్న మరో లక్ష్యం 24 టైటిళ్లతో తిరుగులేని అధిక్యతతో కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న మార్గరెట్ 24 టైటిళ్లను ఛేదించాల్సి ఉంది. ఇప్పటికి ఆమె తిరుగులేని రికార్డుతో నంబర్ వన్ గా ఉన్నారు. జకోవిచ్ కెరీర్ ను చూస్తే.. అతడి పోరాట పటిమకు ముచ్చటేస్తుంది. ఫెదరర్.. నాదల్ చేతుల్లో ఓటములు ఎదుర్కొన్న దశ నుంచి.. వారి ఇద్దరిపై విజయాలు సాధించటమే కాదు.. వారిద్దరి సరసన చేరి..ఇప్పుడు వారిని దాటేయటం కనిపిస్తుంది.
2008లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయంతో గ్రాండ్ స్లామ్ టైటిళ్లలో మొదటి టైటిల్ ను సొంతం చేసుకొని బోణి కొట్టిన అతను.. రెండో టైటిల్ కోసం ఏకంగా మూడేళ్లు ఆగాల్సి రావటం గమనార్హం. 2011లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను మరోసారి సొంతం చేసుకున్నాడు. నిజానికి జకోవిచ్ కెరీర్ కు 2011తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఒకే ఏడాదిలో ఫెదరర్ ను నాదల్ ను ఓడించి టైటిళ్లను సొంతం చేసుకున్న ఘనత జకొవిచ్ కే దక్కింది.
2011లో ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విజేతగా నిలవటమే కాదు.. అదే ఏడాది వింబుల్డన్ లో నాదల్ ను ఓడించాడు. ఆ తర్వాత నుంచి నాదల్ పై అధిపత్యాన్ని ప్రదర్శించి.. ఫైనల్ లో నాలుగుసార్లు విజయం సాధించారు. 2016లో ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకున్న తర్వాత జకో కుడి మోచేతికి గాయమైంది. దీంతో.. అతను తన మేజిక్ ను మిస్ అయ్యాడు. టైటిళ్లను మిస్ చేసుకున్న పరిస్థితి. దీంతో.. అతడి పని అయిపోయిందని చాలామంది విమర్శలు చేశారు. అయితే.. తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకొని.. కొత్త ఉత్సాహంతో తిరిగి కోర్టులోకి అడుగు పెట్టిన అతను 2018లో వింబుల్డన్ లో టైటిల్ ను సొంతం చేసుకోవటం ద్వారా తన విజయయాత్రను మళ్లీ మొదలుపెట్టారు. గడిచిన 20 గ్రాండ్ స్లామ్ ల్లో 11 సార్లు విజేతగా నిలవటం అతడికే సాధ్యం.
కోర్టులో తన అద్భుతమైన ఆటతో ప్రేక్షకుల మదిని దోచే జకోవిచ్.. కోర్టు బయట.. బాల్ బాయ్ ను పక్కన కూర్చోబెట్టుకొని తన డ్రింక్ ను పంచుకోవటం కనిపిస్తుంది. అలాంటి తీరు మరే క్రీడాకారుడిలోనూ కనిపించదు. ఇలాంటి వ్యక్తిత్వంలో ఆటలోనే కాదు ఆటేతర అంశాల్లోనూ తనకు సాటి వచ్చే వారెవరూ లేరన్నట్లుగా జకోవిచ్ ఉంటారు. అందుకే.. మొనగాళ్లకు మొనగాడయ్యారు.