నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కడపలోని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. చంటిగారిపల్లి క్యాంప్ సైట్ నుంచి 121వ రోజు యువగళం పాదయాత్ర మొదలైంది. ఈ క్రమంలోనే లోకేష్ కు మహిళలు, యువకులు, వృద్ధులు ఆత్మీయ స్వాగతం పలికారు. సిద్దవటం ఎమ్మార్వో కార్యాలయం వద్ద జరిగిన బహిరంగసభ జనసంద్రంగా మారింది.
ఈ క్రమంలోనే జగన్ పై లోకేష్ నిప్పులు చెరిగారు. తన మీద కోడిగుడ్డు వేయించి జగన్ ఎక్కడికి పారిపోతాడని లోకేష్ ప్రశ్నించారు. జగన్ ఉండాల్సింది ఏపీలోనే అని, లండన్ పారిపోయినా కోడిగుడ్లతో సన్మానం ఖాయం… రాసి పెట్టుకో అని సవాల్ విసిరారు. సెల్ఫీ ఇవ్వనందుకే కోడిగుడ్డు విసిరారని ఒక పోలీసు అధికారి ప్రెస్ మీట్ పెడతాడని అన్నారు.
‘‘అయ్యా అబద్దాలు చెప్పడంలో మీరు జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. నేను ప్రతి రోజూ వెయ్యి మందికి సెల్ఫీలు ఇస్తాను, అదంతా లైవ్ లో వస్తుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. ఇంకో మంచి స్టోరీ ఏదైనా చెప్పండి’’ అంటూ ఆ పోలీసు అధికారికి లోకేష్ చురకలంటించారు.
మోసానికి మానవ రూపం జగన్, అందుకే మోసగాడు జగన్ అని పేరు పెట్టానని లోకేష్ ఎద్దేవా చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అని బిల్డప్ ఇచ్చిన జగన్ సీపీఎస్ ఎప్పుడు రద్దు చేస్తాడని ప్రశ్నించారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేశాడని దుయ్యబట్టారు. మార్గదర్శి మీద ఫిర్యాదే లేకుండా విచారణ అంటూ హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు.