సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ వడివడిగా అడుగులు వేస్తూ విచారణను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో అనూహ్య పరిణామాలు జరగడం చర్చనీయాంశమైంది. ఇక, ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఏ-8 గా సీబీఐ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతకుముందు, వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 6 గంటల సమయంలో జగన్ కు వివేకా హత్య గురించి ఫోన్ వచ్చిందని అధికారులు వెల్లడించడం సంచలనం రేపింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసులో జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఏ-8 అవినాష్ రెడ్డి అని, మరి ఏ-9 ఎవరని చర్చ జరుగుతోందని రఘురామ అన్నారు. జగన్, ఆయన భార్య వైఎస్ భారతిని విచారణ జరపాలని, అప్పుడే ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు బయటకు వస్తాయని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య గురించి జగన్ కు ముందే తెలుసని సీబీఐ చెప్పిన విషయాన్ని రఘురామ గుర్తు చేశారు.
జగన్, భారతిలకు ఈ విషయం ముందుగా ఎలా తెలుసు అని రఘురామ ప్రశ్నించారు. ఫోన్లో వారు ఎవరితో మాట్లాడారో తెలియాల్సి ఉందని అన్నారు. ఇక, అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.