కొన్ని వేల మాటల్లో చెప్పలేనిది.. ఒక చిన్న వీడియో చెప్పేస్తుంది. మాటల్లో కంటే ఒక మనిషి వ్యక్తిత్వం రియాక్షన్ల ద్వారా సులువుగా అర్థం చేసుకోవచ్చు. రంగుల ప్రపంచంగా చెప్పే సినిమా లోకంలో గుర్తింపు పొందటం అంత తేలికైన విషయం కాదు. టాలెంట్ ఎంత ఉన్నా.. అవకాశాన్ని సొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. కెరీర్ తొలినాళ్లలో తనకు సాయం చేసిన వారిని జీవితాంతం గుర్తించుకునే వ్యక్తులు కొందరు ఉంటారు. తామెంత స్థాయికి వెళ్లినా.. వారిని..వారు చేసిన మేళ్లను మర్చిపోరు. తమకు సాయం చేసిన వారు అనుకోకుండా కనిపిస్తే.. ఎలా రియాక్టు అవుతారు? వారి స్పందన ఎలా ఉంటుంది? అన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది ఈ చిట్టి వీడియో.
స్టార్ హీరోలలో ఒకడు.. విలక్షణతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సిద్ధార్థ కెరీర్ ను చూస్తే.. తనకు తానుగా కష్టపడి ఎదిగిన వైనం గుర్తుకు వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లేకున్నా.. టాలెంట్ నమ్ముకున్న అతడికి.. తొలినాళ్లలో ఒకరు సాయం చేశారు. ఆమె సుజాత రంగరాజన్. ఆమెను ఒక ఇంటర్వ్యూ సందర్భంగా.. సర్ ప్రైజ్ చేసేందుకు వేదిక మీదకు ఆమెను తీసుుకొచ్చారు. ఆమెను చూసినంతనే సిద్దార్థ్ స్పందించిన తీరు చూస్తే నోటి వెంట మాట రాదంతే. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం హీరో సిద్దార్థ్ టక్కర్ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉంటున్నారు.
ప్రమోషన్లలో భాగంగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇంటర్వ్యూ మధ్యలో అతడ్ని సర్ ప్రైజ్ చేస్తూ.. సుజాత రంగరాజన్ స్టేజ్ మీదకు వచ్చారు. ఆమెను చూసినంతనే సిద్ధార్థ్ భావోద్వేగానికి గురయ్యారు. ఒక్కసారి సాష్టాంగ నమస్కారం పెట్టేశారు. అక్కడితో ఆగని అతను.. ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకొని.. ఆమె తనకెంత ముఖ్యమన్న విషయాన్ని చెప్పేశారు. తానో స్టార్ హీరో అన్న విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా.. తనకు మార్గదర్శిగా నిలిచిన ఆమెకు తానిచ్చే ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని చెప్పేశారు.
ఇంతకూ ఆవిడ ఎవరు? అన్న విషయాన్ని వెల్లడిస్తూ.. ఈవిడ పేరు సుజాత రంగరాజన్ అని.. తనను బాయ్స్ మూవీలో హీరోగా తీసుకోవాలని దర్శకుడు శంకర్ ను ఫోన్ చేసి మరీ కోరకపోతే.. ఈ రోజు వేరేలా ఉండేదన్నారు. ఆమె వల్లే తానీ స్థాయిలో ఉన్న విషయాన్ని చెప్పారు. అనంతరం సుజాత రంగరాజన్ మాట్లాడుతూ.. సిద్ధార్థ్ మొదట్నించి దర్శకుడు కావాలని కలలు కన్నాడని.. బాయ్స్ మూవీ కోసం ఆడిషన్స్ జరుగుతుంటే.. తాను సిద్ధార్థ్ ను హీరోగా తీసుకోవాలని దర్శకుడు శంకర్ కు ఫోన్ చేసిన చెప్పానన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
‘నేను సిద్ధార్థ్ ను దర్శకుడు శంకర్ వద్దకు వెళ్లమని కోరాను. సిద్ధార్థ్ అందుకు అంగీకరించలేదు. నేనే బలవంతం చేసి ఒప్పించి పంపా. శంకర్ ఫోన్ చేసి ఒకసారి వచ్చి ఫోటో షూట్ చేసి వెళ్లమని చెప్పటంతో ఇష్టం లేకుండానే వెళ్లాడు. వాళ్లు అతన్ని చూసినంతనే తమ సినిమాలో హీరోగా చెప్పేశారు’’ అంటూ గతాన్నిచెప్పుకొచ్చారు. సుజాత రంగరాజన్ కనిపించినంతనే హీరో సిద్ధార్థ్ స్పందించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. ఆమె చేసిన మేలును గుర్తుంచుకున్నావు.. నువ్వు రియల్ హీరో అంటూ అందరూ ఆయన్ను అభినందిస్తున్నారు. 45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చూసినంతనే భావోద్వేగానికి గురి కావటమే కాదు.. హీరో సిద్ధార్థ్ మీద గౌరవం అమాంతం పెరిగిపోవటం ఖాయం.