వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గతంలో అరెస్టు చేసిన వ్యవహారం దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. రాజద్రోహం సెక్షన్ (124-ఏ)ను జగన్ దుర్వినయోగపరిచి రఘురామపై కక్ష తీర్చుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. రాజద్రోహం పేరుతో రఘురామను అరెస్టు చేయించిన జగన్..కస్టడీలో పోలీసులతో కొట్టించారని ఆరోపణలు వచ్చాయి. రఘురామ అరికాళ్లకు అయిన గాయాల ఫొటోలు వైరల్ కావడం…న్యాయస్థానాలు కూడా దీనిపై వివరణ కోరడంతో జగన్ సర్కార్ ఇరకాటంలో పడింది.
ఈ క్రమంలోనే సీఐడీ ఆఫీసులో ఆ రాత్రి ఏం జరిగిందన్న విషయాన్ని రఘురామ పూసగుచ్చినట్టుగా కేంద్ర సిబ్బంది-ప్రజాసమస్యలు, న్యాయశాఖలకు చెందిన పార్లమెంటరీ కమిటీ సభ్యులతో పంచుకున్న లేఖలో గతంలోనే వెల్లడించారు. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కు సంబంధించి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై తాజాగా కోర్టులో విచారణ జరిగింది. రఘురామ అరెస్టు సందర్భంగా ఆనాడు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జరిగిన వైద్య పరీక్షల రిపోర్టులు భద్రపరచాలని కోరుతూ ఈ పిటిషన్ ను రఘురామ తరఫు లాయర్లు వేశారు.
ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికలను ధ్వంసం చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరారని కోర్టుకు లాయర్ తెలిపారు. అందుకు అనుమతినిస్తే ఆ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు ధ్వంసమవుతాయని న్యాయమూర్తికి విన్నవించారు. దీంతో, ఆ ఆధారాలను పటిష్టంగా భద్రపరిచి కోర్టుకు ఇవ్వాలని ఆదేశించాలంటూ న్యాయమూర్తి కోరారు. ఈ నేపథ్యంలోనే ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు కీలక ఆదేశానలు జారీ చేసింది.
ఆ పిటిషన్ కు సంబంధించిన అన్ని వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్, గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్, వైద్య విద్య డైరెక్టర్ లను కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 13వ తేదీకి వాయిదా వేసింది.