సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా మర్డర్ కేసు మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు దాదాపుగా ఖాయం అనుకుంటున్న తరుణంలో ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంపై వివేకా కూతురు వైఎస్ సునీత సుప్రీంకోర్టు తలుపు తట్టారు.
ఇదిలా ఉండగానే ఈ కేసులో తాజాగా మరో సంచలన అంశం తెరపైకి వచ్చింది. వివేకా హత్య జరిగిన రోజు హాట్ టాపిక్ గా మారిన లేఖకు నిన్ హైడ్రిన్ టెస్ట్ చేసేందుకు సీబీఐ కోర్టు ఈ రోజు అనుమతి మంజూరు చేసింది. ఆ లేఖపై ఉన్న వేలిముద్రలను వివేక హత్య కేసులో అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని, అందుకే ఆ టెస్ట్ కు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును సిబిఐ అధికారులు కొద్దిరోజుల క్రితం అభ్యర్థించారు. ఈ క్రమంలోనే వారు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సీబీఐ కోర్టు ఈరోజు తాజాగా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అంతకుముందు, ఆ లేఖను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ కు సీబీఐ పంపింది. 2021 ఫిబ్రవరి 11న ఆ లేఖను సిబిఐ అధికారులు పంపించారు. వివేకా ఆ లేఖను రాసినట్టుగా సిఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సిఎఫ్ఎస్ఎల్ ను సిబిఐ కోరింది. అయితే, అలా వేలిముద్రల గుర్తింపు కోసం నిన్ హైడ్రిన్ పరీక్ష చేయాల్సి ఉంటుందని సిబిఐకి సిఎఫ్ఎస్ఎల్ తెలిపింది. ఈ పరీక్ష జరిగిన తర్వాత వేలిముద్రలు ఎవరివనే విషయం నిర్ధారణ అయితే ఈ కేసులో మరింత పురోగతి లభించే అవకాశం ఉంది. అయితే, ఈను పరీక్ష జరిపిన తర్వాత లేఖపై రాత, అక్షరాలు, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు.