జగన్ అప్పులు…దానికోసం ఆయన పడుతున్న తిప్పలపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ మొదలు కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. జగన్ ఏపీని అప్పుల ఊబిలో నెట్టేశారని టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో పలుమార్లు విమర్శించారు. అయినా సరే, ఆదాయం పెంచుకునే మార్గాలను వదిలేసిన జగన్..అప్పుల కోసం మాత్రం అన్వేషిస్తూనే ఉన్నారు. జగన్ అప్పులపై కాగ్ కూడా పలుమార్లు మొట్టికాయలు వేసినా సరే ఫలితం లేకపోయింది.
మూడున్నరేళ్లలో జగన్ రూ. 8 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారని, కానీ, ప్రజల ఆదాయం పెరగలేదని, అభివృద్ధీ జరగలేదని ప్రతిపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. వసూలు చేస్తున్న పన్నుల సొమ్ము ఎటు పోతోందో లెక్క లేదని, అప్పులకు, ఆదాయానికి సంబంధం లేదని మండిపడుతున్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా సరే జగన్ అప్పులు చేయడం మాత్రం మానడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం మరోసారి అప్పు తెచ్చింది. 3 వేల కోట్ల రుణాన్ని తీసుకొని రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఆ మొత్తాన్ని వచ్చే 20 ఏళ్లపాటు వివిధ వడ్డీ శాతాలతో చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఎఫ్ఆర్బీఎం పరిమితిలో కేవలం 65 రోజుల వ్యవధిలోనే 18,500 కోట్లను ఏపీ ప్రభుత్వం అప్పుగా తీసుకోవడంతో విమర్శలు వస్తున్నాయి. రూ.3 వేల కోట్లలో.. రూ.వెయ్యి కోట్లను 14 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీతో, మరో వెయ్యి కోట్లను 20 సంవత్సరాలకు 7.33 శాతం వడ్డీ చెల్లించనుంది. రూ.500 కోట్లను 10 సంవత్సరాలకు 7.33 శాతం వడ్డీతో, మరో రూ. 500 కోట్లను 19 సంవత్సరాలకు 7.33 శాతం వడ్డీతో చెల్లించనుంది.
జూన్ నెలకు సంబంధిం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు పూర్తిస్థాయిలో చెల్లించలేదు. అయితే, తాజాగా ఈ 3 వేల కోట్ల రూపాయలు అప్పు తేవడంతో పూర్తి స్థాయిలో వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తారో లేదో అన్నది తేలాల్సి ఉందని ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.