జగన్ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా సరే అధికార పార్టీ తీరు మాత్రం మారడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రకాశం జిల్లాలోని టంగుటూరు ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ భార్య, అంగన్వాడీ టీచర్ హనుమాయమ్మను వైసీపీ నేత కొండల్రావు ట్రాక్టర్ తో గుద్ది చంపారన్న ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.
ఆమె మృతిపై డీజీపీతో పాటు జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కు చంద్రబాబు లేఖలు రాశారు. ఎస్సీ మహిళ మృతిపై జోక్యం చేసుకోవాలని డీజీపీని కోరారు. అంతేకాదు, ఆమె మృతిపై కేంద్ర దర్యాఫ్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక, ఈ ఘటనలో వైసీపీ నేతలకు పోలీసుల సహకారంపై కూడా దర్యాఫ్తు జరపాలని కోరారు. మృతురాలి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని, ఆమె కూతురుకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు..
మరోవైపు, తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం వస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో లేకున్నా తెలంగాణలో కార్యకర్తల ఉత్సాహం చూస్తే ముచ్చటేస్తోందని చెప్పారు. తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అని, దానికి టీడీపీ వేసిన పునాదే కారణమని చెప్పారు.. హైదరాబాద్ అభివృద్ధిలో ప్రతి అడుగులో టీడీపీ ముద్ర ఉందని, తెలుగు వాళ్లు ప్రపంచం నలుమూలలా ఉండటానికీ టీడీపీయే కారణమని చెప్పారు. 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల కోసం టీడీపీ పని చేస్తుందని, ప్రతి తెలుగు వాడిని సంపన్నుడిగా చేయాలన్నదే టీడీపీ లక్ష్యమని చెప్పారు.