టీడీపీ నేతలను ఇరుకున పెట్టడమే జగన్ ఎజెండా అని ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబును ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యంతో ఆయన నివాసం ఉంటున్న ఉండవల్లి కరకట్ట వద్ద గల లింగమనేని ఇంటిని జఫ్తు చేసేందుకు ఏపీః సీఐడీ ప్రయత్నించిన సఃంగతి తెలిసిందే. ఆ ఇంటి జప్తునకు అనుమతినివ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. చంద్రబాబుకు సంబంధించిన ఆ ఇంటిని అటాచ్ చేసేందుకు పర్మిషన్ కోరింది.
ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సీఐడీ వేసిన పిటిషన్పై ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. అలా అనుమతివ్వాలంటే ఆ వ్యవహారానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలున్నాయా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. అంతేకాదు, ఆ ఇంటి జఫ్తు కోసం అభ్యర్థించిన అధికారిని తాము విచారణ జరపాల్సి ఉంటుందని చెప్పింది.
దాంతోపాటు, మే 18న నోటీసులు జారీ చేసిన కారణంగా లింగమనేని రమేశ్ కు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఏసీబీ కోర్టు తాజా నిర్ణయంతో ఈ కేసులో చంద్రబాబుకు ఊరట లభించినట్లయింది.