టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. అయితే.. దీనిపై వైసీపీ నుంచి ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి విమర్శలు వచ్చాయి. టీడీపీని బతికించుకునేందుకే ఆయన ఇలా.. పొత్తుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. అదేవిధంగా మిగిలిన నేతల్లో చాలా మంది కూడా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
ఆయా విమర్శలకు చంద్రబాబు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ‘నేను కేసుల కోసం ఢిల్లీ వెళ్లలేదు. రాష్ట్రం కోసం వెళ్లాను’ అని వ్యాఖ్యానించారు. పార్టీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండ్రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశమైన అంశం ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణకు చెందిన పార్టీ నేత ఒకరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
ఇద్దరు రాజకీయ నేతలు కలిస్తే తప్పుబట్టాల్సిన అవసరం లేదని, ఆ రాష్ట్రంలో టీడీపీతో తమ పార్టీకి పొత్తు ఉండదని సంజయ్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అదేవిధంగా మంత్రి పెద్దిరెడ్డి చేసిన విమర్శలు కూడా నేతలు చంద్రబాబుకు చెప్పారు. దీంతో చంద్రబాబు స్పందిస్తూ.. ‘నేనేమీ కేసుల కోసమో.. కేసుల్లో ఉన్నవారిని రక్షించాలని అడగడం కోసమో వెళ్లలేదు. రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లాను.“ అని వ్యాఖ్యానించారు.
పొత్తుల గురించి మీరెవరూ ఇప్పుడు మాట్లాడొద్దని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్నిక లు వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచిద్దామన్నారు. ఈలోపు ప్రజల్లోకి వెళ్లి పనిచేస్తూ మనం బలోపేతం కావడంపై దృష్టి పెడదామని చంద్రబాబు వారికి సూచించారు. మరి ఇప్పటికైనా వైసీపీ నాయకులు.. చంద్రబాబుపై విమర్శలు మానుకుంటారో లేదో చూడాలి.
ఇదిలావుంటే.. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసా రీ పోలవరం గురించే మాట్లాడారని వైసీపీ నాయకులు చెబుతుంటారు. కానీ, ఆయన ఢిల్లీ నుంచి ఇలా రాగానే ఇక్కడ వివేకానందరెడ్డి కేసులో మార్పులు చోటు చేసుకుంటున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.