జగన్ పాలనలో రాష్ట్రంలో ఒక కొత్త ఒరవడికి తెరలేచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై, జగన్ పాలనను విమర్శించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం పరిపాటిగా మారింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో అరెస్ట్ చేయించడం, లేదంటే బెదిరింపులకు పాల్పడడం, వ్యక్తిత్వహననానికి గురి చేయడం వంటివి వైసీపీ నేతలకు అలవాటుగా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిని పోలీసులు అరెస్టు చేశారు..
గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని టిడిపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు పిలుపునిచ్చారు. డోలాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అశోక్ బాబుతో పాటు వైసీపీ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని నాయుడుపాలెంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. డోలా ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలంతా టంగుటూరు వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ క్రమంలోనే వైసీపీ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే డోలా ఆధ్వర్యంలో వరికూటి అశోక్ బాబు ఇంటి ముట్టడికి టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో, ఇరువర్గాల మధ్య మార్గమధ్యంలో తోపులాట జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే డోలా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డోలాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, వైసీపీ ఇన్చార్జి వరికూటి అశోక్ బాబును, వైసీపీ నేతలను పోలీసులు వదిలిపెట్టడం విశేషం. ముందుగా తమ ఇంటి ముట్టడికి ప్రయత్నించింది వైసీపీ కార్యకర్తలని, వారిని వదిలేసి తమను అరెస్ట్ చేయడం ఏమిటని డోలాతో పాటు టీడీపీ నేతలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు.