ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైసిపి అధినేత జగన్ 2019 ఎన్నికలకు ముందు ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలికిన సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికలలో తన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ బీరాలు పలికారు. అయితే, జగన్ మాటలు నమ్మిన జనం వైసీపీకి 22 మంది ఎంపీలను కట్టబెట్టారు.
సీన్ కట్ చేస్తే ప్రత్యేక హోదా పేరుతో జగన్ వందలసార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కానీ, ఏపీకి మాత్రం హోదా కాదు కదా…బూడిద కూడా రాలేదు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు అంటూ ఢిల్లీ టూర్ కి వెళుతున్న జగన్ తనపై ఉన్న కేసులు, వివేకా కేసు గురించి కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి వస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సెటైర్లు వేశారు.
ఏపీకి హోదా సాధించలేకపోయిన జగన్….తన బాబాయి వైఎస్ భాస్కర్ రెడ్డికి జైల్లో ప్రత్యేక హోదా కల్పించారని రఘురామ చురకలంటించారు. తన బాబాయ్ భాస్కర్ రెడ్డికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఢిల్లీ పెద్దలను జగన్ ఒప్పించగలిగారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారని రఘురామ సెటైర్ వేశారు. ప్రజా కోర్టులో ప్రజలే న్యాయమూర్తులని, వారికి కూడా తీర్పు చెప్పే అవకాశం వస్తుందని రఘురామ అన్నారు. నిబంధనలు అతిక్రమించిన జగన్ కేంద్ర సర్వీసులలోని జూనియర్ అధికారులను రాష్ట్రానికి డిప్యుటేషన్ పై తీసుకొచ్చి కీలక బాధ్యతలు అప్పచెబుతున్నారని అన్నారు.
ఈ విషయంపై రాష్ట్రంలోని సీనియర్ అధికారులు జగన్ ను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. టీటీడీ ఈవో పోస్ట్ ఐఏఎస్ అధికారుల హక్కు అని, కానీ ఆ పోస్టులో ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ నుంచి వచ్చిన ధర్మారెడ్డిని నియమించారని గుర్తు చేశారు. భీమవరం నుంచి పోటీ చేయాలని తాను పవన్ ను కోరుతున్నానని, మంచి మనిషిని ఓడించామన్న బాధ అక్కడి ప్రజల్లో ఉందని రఘురామ చెప్పారు. ఈసారి పవన్ కు 60 వేలకు పైగా మెజారిటీ రావడం ఖాయమని రఘురామ జోస్యం చెప్పారు.