విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ అట్టడుగు స్థాయికి పడిపోయిందని ఆర్థిక నిపుణులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ పాలనలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ ఒక్క పెట్టుబడిదారుడు ముందుకు రావడం లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై ఇన్వెస్టర్లకు నమ్మకం కలగడం లేదని ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రాక, ఆల్రెడీ ఉన్న కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేక…ఏపీలో పెట్టుబడులు ఎండమావిలా తయారయ్యాయని విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే విదేశీ పెట్టుబడులు సాధించడంలో ఏ రాష్ట్రం ఏ స్ఠానంలో ఉందో తెలిపేలా ఇండియన్ టెక్ అండ్ ఇన్ ఫ్రా సంస్థ ఓ ట్వీట్ చేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రాల జాబితాను ఇండియన్ టెక్ అండ్ ఇన్ ఫ్రా విడుదల చేసింది. ఆ జాబితాలో ఏపీకి 13వ స్థానం లభించింది. ఈ నేపథ్యంలో జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
ఈ జాబితాలో ఆంధప్రదేశ్ ఎక్కడుంది జగన్? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర పాలనలో జగన్ వైఫల్యం ఏపీని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జాబితాలో 13వ ర్యాంకుకు దిగజార్చిందని దుయ్యబట్టారు. “దోచుకో, పంచుకో, తినుకో విధానంతో నువ్వు దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రివి అయ్యావు. కానీ ప్రజలు మాత్రం కనీస అవసరాలకు కూడా నోచుకోవడంలేదు. నీ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు. ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు” అని చంద్రబాబు అన్నారు.