ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయింది. 2019 మే 30వ తేదీనాడు.. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక, ఇప్పటికి ఆయన పాలన పరంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. దీంతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. సమసమాజాన్ని నిర్మించే పనిలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని, అభివృద్ధి.. సంక్షేమం అంటే ఏంటో చేసి చూపించారని కొనియాడారు.
ఇంత వరకు బాగానేఉన్నా.. ఈ సమయంలోనూ సజ్జల ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. గుంటనక్కలు అంటూ.. దుయ్యబట్టారు. అయితే.. సజ్జల చేసిన వ్యాఖ్యలపై తటస్థంగా ఉండే రాజకీయ విశ్లేషకులు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. మనం చేసిందీ అంతేకదా.. సజ్జల సర్! అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇంతకీ సజ్జల ఏమన్నారు.. దీనికి రాజకీయ విశ్లేషకులు ఎలాంటి కౌంటర్ ఇచ్చారో.. చూద్దాం.
సజ్జల: జగన్ చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని కొన్ని గుంట నక్కలు తట్టుకోలేకపోతున్నాయి.
విశ్లేషకులు: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. మనం కూడా అదే చేశాంగా సర్. అమరావతిలో ఏ ప్రాజెక్టు వచ్చినా.. వ్యతిరేకంగా మాట్లాడలేదా.. అమరావతికి అప్పులు ఇవ్వొద్దంటూ.. ప్రపంచ బ్యాంకుకే ఏకంగా లేఖలు రాయలేదా?
సజ్జల: జగన్ ఏం అభివృద్ధి, సంక్షేమం తెచ్చారో ప్రజలకు తెలుసు. యాభై శాతం ఫలాలు మహిళల పేరుతోనే అందుతున్నాయి. కానీ, జనాల్ని మోసం చేయడానికి చంద్రబాబు మళ్లీ వస్తున్నాడు. దత్తపుత్రుడితో కలిసి ఎన్నికలకు పోవాలని చూస్తున్నాడు.
విశ్లేషకులు: ఇది కామనే సజ్జల సర్. రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ఎవరి ఎత్తులు వారికి ఉంటాయి. గతంలో 2019 ఎన్నికలకు ముందు కేంద్రంలో వైసీపీ చక్రం తిప్పిన పరిస్థితి ఇంకా కళ్లముందు కనిపిస్తోంది సర్!
సజ్జల: కళ్లార్పకుండా చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారు. 2014-2019 మధ్య చంద్రబాబు ఏం చేశాడో ప్రజలు మర్చిపోలేదు. అన్న క్యాంటిన్ పేరుతో ఎంత దోచుకున్నారో అందరికీ తెలుసు.
విశ్లేషకులు: మరి దోపిడీ చేశారని అంటున్నవారిపై ఈ నాలుగేళ్ల కాలంలో అధికారంలో ఉండి.. ఏం చేశారు సర్? కేవలం మాటలు చెప్పడమేనా?
సజ్జల: అమ్మ ఒడిని కాపీ కొట్టి.. అమ్మకు వందనం పేరుతో వస్తానని చంద్రబాబు అంటున్నాడు. ప్రజలు నమ్మరని కూడా ఆయనకు తెలుసు.
విశ్లేషకులు: రాజకీయాల్లో అందరివీ కాపీ పథకాలే సర్. అమ్మ ఒడిని మీరు విదేశాల నుంచి దోచుకున్న ఆలోచన కాదా! ఇతర పథకాలను అన్న ఎన్టీఆర్, వైఎస్ అమలు చేసినవే కదా. కాబట్టి.. ఇక్కడ కాపీ అనేది ఏమీ ఉండదు. కొంచెం ఎక్కువ.. కొంచెం తక్కువ అంతే!
సజ్జల: హామీలు అమలు చేస్తున్నందునే మనం జనంలోకి ధైర్యంగా వెళ్లగలుగుతున్నాం.
విశ్లేషకులు: అవును. ఇది నిజం. కానీ.. మీరు వెళ్లడం లేదు. ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు. వారు ప్రజలతో తిట్లు చివాట్లు తింటున్నారు. గ్రామాలకు గ్రామాలే తాళాలు వేసి ఎమ్మెల్యేలను చీదరించుకునే స్థాయికి దిగజార్చారు.