రాజమండ్రిలో జరిగిన మహానాడులో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. చిల్లర, చెత్త, పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడును చెడగొట్టేందుకు ఫ్లెక్సీలు కట్టారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ధరలు పెరిగి ప్రజలంతా నష్టపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపై తమను అడ్డుకున్న వారిని తొక్కుకుంటా వెళ్తామని వెల్లడించారు. “రాజకీయ వైసీపీ రౌడీలూ ఖబడ్దార్!“ అని హెచ్చరించారు.
తెలుగువారి రుణం తీర్చుకునేందుకే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. పాలనలో పేదవారి కోసం ఆలోచించిన నాయకుడు.. ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత.. ఎన్టీఆర్దే అంటూ చంద్రబాబు వెల్లడించారు. బడుగు, బలహీనవర్గాలను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తెచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ శతజయంతిని దేశ, విదేశాల్లో ఘనంగా నిర్వహించారని చంద్రబాబు వెల్లడించారు.
“రాజకీయ రౌడీలు ఖబడ్దార్.. టీడీపీ కార్యకర్తలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ప్రతి ఒక్కరి పేరూ రాసుకున్నాం. అధికారంలోకి రాగానే ఎక్కడున్నా తరిమి కొడతాం“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయ రౌడీలు ఖబడ్దార్.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అంకితభావం కలిగిన కార్యకర్తలు ఉండటమే టీడీపీ బలం అంటూ వెల్లడించారు. టీడీపీని దెబ్బతీద్దామని చూసి అనేకమంది విఫలమయ్యారని చంద్రబాబు గుర్తుచేశారు.సంపద సృష్టించడం నేర్పిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని వెల్లడించారు. ఒకేసారి రూ.50 వేలు రైతు రుణమాఫీ చేసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు.
ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్ ఇచ్చాంమన్న చంద్రబాబు.. ఇప్పుడు సమయానికి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తన వల్లే గతంలో అమరావతికి 29 వేలమంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని చంద్రబాబు వెల్లడించారు. పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరానికీ నీళ్లు ఇద్దామని చూసినట్లు చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా… రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామన్న ఆయన.. నాలుగేళ్ల మోసకారి జగన్ పాలనలో ఒక్కరికి సైతం ఉద్యోగం ఇవ్వలేదన్నారు.