మాజీ మంత్రి వివేకా హత్యకేసులో సంచలన వ్యాఖ్య చేసింది సీబీఐ. వైసీపీ ఎంపీ అవినాశ్ కు ముందస్తు బెయిల్ పై సాగిన వాదనల నేపథ్యంలో సీబీఐ నోటి నుంచి రహస్య సాక్షి అంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సదరు రహస్య సాక్షి ఇచ్చిన స్టేట్ మెంట్ తోనే వివేకా హత్య వెనుక విస్తృత రాజకీయ కుట్ర ఉందని బట్టబయలు అయిందన్న విషయాన్ని పేర్కొంది. హత్య వెనుక రాజకీయ కారణాలు తప్పించి మరే ఇతర కారణాలు లేవనే వాదనకు ఈ స్టేట్ మెంట్ తో తిరుగులేని బలం చేకూరినట్లుగా సీబీఐ పేర్కొంది.
ప్రస్తుత పరిస్థితుల్లో సదరు సాక్షి వివరాల్ని తాము బయటకు వెల్లడించలేమని.. అయితే.. ఆ రహస్య సాక్షి ఇచ్చిన వాంగ్మూలం తమ వద్ద ఉందన్న విషయాన్ని స్పష్టం చేసింది. సీబీఐ తరఫు వాదనలు వినిపించిన న్యాయవాదులు డాక్టర్ అనిల్ కుమార్ కొంపల్లి.. అనిల్ తల్వార్ లు తమ వాదన సందర్భంగా సంచలన అంశాన్ని వెల్లడించారు. తమకు రహస్య సాక్షి ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాల్ని వారు ప్రస్తావించారు.
వారి వాదనల్లో వెల్లడించిన వివరాల్ని చూస్తే.. ‘‘కండ ఎంపీ టికెట్ ను ఎట్టి పరిస్థితుల్లో అవినాశ్ రెడ్డికి ఇవ్వరాదని వివేకా పట్టుబట్టారు. ఒకవేళ అవినాశ్ రెడ్డికే ఇస్తే తాను వైసీపీని వదిలేసి టీడీపీలో చేరుతానని వివేకా హెచ్చరించారు. కడప ఎంపీ టికెట్ తనకే కావాలని కూడా వివేకా పట్టుబట్టలేదు. షర్మిల లేదంటే విజయమ్మకు ఇవ్వాలని పట్టుబట్టారు. కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయటానికి వివేకా ఒకరిని ఒప్పించారు.కావాలంటే అవినాశ్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని వివేకా పేర్కొన్న విషయాన్ని రహస్య సాక్షి చెప్పారు’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇంతకీ ఆ రహస్య సాక్షి ఎవరు? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
భద్రతా కారణాల వల్ల ఇప్పుడు ఆ రహస్య సాక్షి పేరును తాము వెల్లడించలేమని.. త్వరలో సప్లిమెంటరీ ఛార్జిషీట్ లో ఆ వాంగ్మూలాన్ని వెల్లడిస్తామని సీబీఐ న్యాయవాది పేర్కొన్నారు. ఆ వివరాలు కావాలంటే సీల్డ్ కవర్ లో స్టేట్ మెంట్ సమర్పిస్తామని.. అయితే.. ఈ విషయం అత్యంత రహస్యం అయినందున పిటిషనర్ న్యాయవాదులకు ఎట్టి పరిస్థితుల్లో తెలీకూడదని పేర్కొనటం గమనార్హం. గతంలోనూ సాక్ష్యుల పేర్లు వెల్లడించిన తర్వాత వారు తమ వాదనల్ని మార్చటమో.. లేదంటే చనిపోవటమో జరిగిన విషయాన్ని కోర్టు ఎదుట వెల్లడించారు.
ఈ సందర్భంగా తమ వాదనలకు బలం చేకూరేలా వారు వాదనలు వినిపిస్తూ.. ‘‘వివేకా హత్యాస్థలానికి చేరుకున్న మొట్టమొదటి చట్టబద్ధమైన వ్యక్తి సీఐ శంకరయ్య. అతడు అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా సీఆర్పీసీ 161 స్టేట్మెంట్ ఇచ్చి.. మేజిస్ట్రేట్ వద్ద సీఆర్పీసీ 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి రాలేదు. అలాగే రూ.10 కోట్లు ఇస్తాం.. హత్య చేసినట్టు ఒప్పుకోవాలని తనకు ఆఫర్ ఇచ్చారని చెప్పిన గంగాధర్‌రెడ్డి చనిపోయాడు’’ అని పేర్కొన్నారు. అందుకే తాము రహస్య సాక్షి పేరును సరైన సమయంలో ఛార్జిషీట్ లో చేరుస్తామని పేర్కొన్నారు. ఈ మధ్యనే రికార్డు చేసిన రహస్య సాక్షి వాంగ్మూలంతో వివేకా హత్య వెనుకున్న విస్తృత రాజకీయ కుట్ర బట్టబయలైందన్న వాదన ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఎవరా రహస్య సాక్షి అన్నదిప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్ గా మారింది.