వివేకానందరెడ్డి మర్డర్ కేసు విషయంలో లెటస్ట్ డెవలప్మెంట్లు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. హత్య జరిగిన ఇంత కాలానికి కోర్టులో సుదీర్ఘమైన విచారణ జరిగింది. గడచిన నాలుగేళ్ళల్లో హత్యకేసుపై దాదాపు ఏడుగంటలు లాయర్ తన వాదనను వినిపించటం ఇదే మొదటిసారి. అవినాష్ లాయర్ శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు తన వాదనలు వినిపించారు. తర్వాత సీబీఐ లాయర్ వాదనలు మొదలుపెట్టారు. శనివారం కూడా సీబీఐ లాయర్ వాదనలు వినిపించబోతున్నారు.
సీబీఐ లాయర్ వాదనలు వినిపించే సమయంలోనే సీబీఐ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ఏముందంటే వివేకా చనిపోయిన సమాచారం జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసని. తెల్లవారి 4 గంటల ప్రాంతంలోనే వివేకా చనిపోయిన సమాచారం జగన్ కు అందిందని తాజాగా ఆరోపించింది. అయితే అందుకు సీబీఐ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా అంటే లేదు. తెల్లవారి 4 గంటల ప్రాంతంలోనే వివేకా చనిపోయినట్లు జగన్ కు సమాచారం ఉన్నట్లుగా ఏమన్నా ఆధారం ఉందా అని జడ్జి అడిగినపుడు సీబీఐ లేదని చెప్పింది.
తమకున్న సమాచారాన్ని మరింత లోతుగా విచారించేందుకే అవినాష్ ను కస్టడీలోకి తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది సీబీఐ. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ నిజమే అయితే జగన్ సమాధానం చెప్పుకోకతప్పదు. ఎందుకంటే వివేకా చనిపోయిన విషయాన్ని తాను జమ్మలమడుగుకు వెళుతున్నపుడు సమాచారం అందినట్లు కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెబుతున్నారు. వివేకా చనిపోయిన విషయం ఆయన పీఏ కృష్ణారెడ్డి ద్వారానే ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రపంచానికి తెలిసిందని ప్రచారంలో ఉంది.
వివేకా చనిపోయిన విషయం కృష్ణారెడ్డే వివేకా కూతురు సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారట. రాజశేఖరరెడ్డి సోదరుడు శివప్రకాష్ రెడ్డికి చెప్పారు. శివప్రకాష్ రెడ్డే తనకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారని అవినాష్ చెబుతున్నారు. మరిదంతా నిజమే అయితే ఉదయం 4 గంటల ప్రాంతంలోనే వివేకా చనిపోయిన విషయం జగన్ కు ఎవరు చెప్పారు ? అసలు తెల్లవారి 4 గంటల ప్రాంతంలో వివేకా చనిపోయిన విషయమై జగన్ కు ఫోన్ వచ్చింది నిజమేనా ? అంతా గందరగోళంగా ఉంది. ఏదేమైనా తాజా అఫిడవిట్ పై జగన్ అయితే సమాధానం చెప్పుకోవాల్సిందే.