అనూహ్యంగా వార్తల్లోకి వచ్చారు విమలారెడ్డి. ఇంతకూ ఎవరామె? అంటే.. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అత్త. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాశ్ తప్పు ఏమీ చేసి ఉండకపోవచ్చన్న మాట చెప్పిన ఆత్త విమలారెడ్డి మాటల వేళ.. ఆమెకు సంబంధించిన విషయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. విశాఖ శివారులో ఏర్పాటు చేసిన చర్చి లో మతపరమైన ప్రార్థనలకు వచ్చి సందేశాల్ని ఇచ్చేందుకు వచ్చే ఆమెకు సంబంధించిన వివరాలు తెలిస్తే.. ‘ఔరా’ అనుకోకుండా ఉండలేం.
విశాఖలోని సాగర తీరంలో రూ.300 కోట్లు విలువైన 7 ఎకరాలకు పైనే భూమిని సెయింట్ లూక్స్ మైనార్టీ ఎడ్యుకేషనల్ సొసైటీకి కొన్నేళ్ల క్రితం కేటాయించారు. పేదల వైద్య అవసరాలు తీర్చేందుకు వీలుగా మిషనరీ ఆసుపత్రి నడిపి.. సమీప గ్రామాల్లోని వారికి వైద్య సేవలు.. వైద్య శిబిరాలు అందించి మందులు పంపిణీ చేస్తామన్న మాటను ప్రభుత్వానికి చెప్పారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2004లో అప్లికేషన్ పెట్టుకోగా.. 2006లో అప్పటి మంత్రివర్గం ఈ విన్నపాన్ని రిజెక్టు చేసింది.
అయితే.. ఈ వ్యవహారంలో వైఎస్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్న నేపథ్యంలో సదరు సొసైటీ పెట్టుకున్న అప్లికేషన్ కు అనుగుణంగా 2009 ఫిబ్రవరి 20న 7.35 ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భూమిని తీసుకొని దాదాపు పద్నాలుగేళ్లు అవుతున్నా.. అక్కడ పేదోళ్లకు ఆసుపత్రి కట్టింది లేదు. కానీ.. అక్కడ రేకుల షెడ్డు వేసి.. నర్సింగ్ ట్రైనింగ్ ఇస్తామని పేర్కొనటంతోపాటు.. చర్చిని నిర్మించేశారు. ప్రభుత్వం కేటాయించిన ఏడు ఎకరాల భూమిలో రోడ్లకు కొంత భూమి పోగా.. నికరంగా ఆరు ఎకరాల స్థలం నిలిచింది. ఇప్పటి లెక్క ప్రకారం ఈ భూమి విలువ అక్షరాల రూ.300 కోట్లు.
ఈ మధ్యనే నర్సింగ్ విద్యార్థులకు హాస్టల్.. యోగా శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రా వర్సిటీతో ఒప్పందాలుజరిగాయి. చెప్పిన మాటలకు ఏ మాత్రం సంబంధం లేని పనులు చేస్తున్న ఈ భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కొన్నేళ్ల క్రితం వేసిన కమిటీ చెప్పినా.. పెద్దగా పట్టించుకున్నది లేదు. పేదల కోసం ఆసుపత్రి ఎందుకు కట్టలేదంటే అక్కడ మట్టి స్వభావం భవనాల్ని నిర్మించేందుకు అనువుగా లేదని చెబుతున్న వారు.. అక్కడ చర్చిని మాత్రం ఏర్పాటు చేయటం గమనార్హం. ఈ చర్చిలో సందేశాన్ని ఇవ్వటం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమలారెడ్డి తరచూ ఇక్కడకు వస్తూ మత సందేశాల్నిఇచ్చి వెళతారన్న మాట స్థానికులు చెబుతుంటారు. భూమి కేటాయింపుల వేళ అక్కడ మార్కెట్ ధర రూ.1.5కోట్లు అయితే.. సేవ చేసేందుకు కావటంతో ఎకరా రూ.25 లక్షలకే ఇచ్చేశారు. ఇప్పుడీ భూమి విలువ రూ.300 కోట్లు. కానీ.. అక్కడ ఏర్పాటైంది పేదల ఆసుపత్రి కాదు.. నాలుగు షెడ్లు.. ఒక చర్చి మాత్రమేనన్న మాటను చెబుతున్నారు.