తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళల్లో కాంగ్రెస్ తరపున నామినేషన్ వేసిన డాక్టర్ చింతామోహనే అత్యంత పేద అభ్యర్ధి. వైసీపీ తరపున డాక్టర్ గురుమూర్తి, టీడీపీ తరపున పనబాక లక్ష్మి, బీజేపీ తరపున రత్నప్రభ, కాంగ్రెస్ తరపున డాక్టర్ చింతామోహన్ నామినేషన్లు దాఖలు చేశారు. వీళ్ళల్లో వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధులు సోమవారం తమ నామినేషన్లను వేశారు.
వీళ్ళ నామినేషన్ల సందర్భంగా ఆస్తులు, అప్పుల విషయంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా చింతామోహన్ అత్యంత పేద అభ్యర్ధిగాను అత్యంత ధనిక అభ్యర్ధిగా బీజేపీ తరపున పోటీచేస్తున్న రత్నప్రభ నిలిచారు. రత్నప్రభ కుటుంబఆస్తులు రూ. 24.68 కోట్లు. బీజేపీ అభ్యర్ధి మాజీ ఐఏఎస్ అధికారన్న విషయం తెలిసిందే. ఈమె భర్త విద్యాసాగర్ కూడా ఐఏఎస్ అధికారిగా పనిచేశారు.
ఇక అధికారపార్టీ తరపున పోటీచేస్తున్న డాక్టర్ గురుమూర్తి కుటుంబ ఆస్తులు రూ. 47.25 లక్షలు. గురుమూర్తి పేరుతో రూ. 10 లక్షల విలువైన చరాస్తులు, భార్య నవ్యకిరణ్ పేరుతో సుమారు రూ. 25 లక్షల చరాస్తులున్నాయి. వీళ్ళకు అప్పులేమీలేవు. గురుమూర్తి రాజకీయాల్లోకి ప్రవేశించటం, పోటీ చేయటం కూడా ఇప్పుడే.
విచిత్రమేమిటంటే తొమ్మిదిసార్లు ఎంపిగా పోటీచేసిన చింతామోహన్ 6 సార్లు గెలిచారు. ఐదేళ్ళు కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చింతాకు ఒక్కరూపాయి కూడా ఆస్తిలేదంటే పాపం ఇంత పేద అభ్యర్ధి ఎన్నికల్లో డబ్బులు ఎలా ఖర్చు పెడతారో ఏమో.