టాలీవుడ్ హీరోయిన్, డస్కీ బ్యూటీ డింపుల్ హయతి తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్న డింపుల్ తన అపార్ట్మెంట్ లో ఉంటున్న ట్రాఫిక్ డిసిపి రాహుల్ కారును ఢీ కొట్టినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే డింపుల్ హయతి పై కేసు కూడా నమోదయింది. రాహుల్, డింపుల్ ల మధ్య చాలా కాలంగా పార్కింగ్ స్థలం విషయంలో వివాదం నడుస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అందుకే, డింపుల్ పై పదే పదే ట్రాఫిక్ చలానాలు వేస్తున్నారని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే డింపుల్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. అధికార దుర్వినియోగంతో తప్పులు దాచిపెట్టలేరు అంటూ ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.. అయితే, ఈ వివాదంపై డిసిపి రాహుల్ కూడా స్పందించారు. పార్కింగ్ స్థలంలో కారు అడ్డుగా పెట్టవద్దని డింపుల్ కు చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా వినలేదని ఆయన ఆరోపించారు.
నిర్లక్ష్యంగా కారు అడ్డుగా పెట్టడంతో తమ సిబ్బంది చాలాసార్లు ఆమె కారు పక్కన పెట్టాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అయితే, కొంతకాలంగా జూబ్లీహిల్స్ పరిధిలో డింపుల్ కారుకు భారీగా చలాన్లు విధించినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అధికార దుర్వినియోగం గురించి డింపుల్ తాజాగా ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది.