ఈ నెల 16, 19 తేదీల్లో సీబీఐ విచారణకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరైన సంగతి తెలిసిందే. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో ఈ నెల 22న విచారణకు రావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే, ఆమె డిశ్చార్జి అయ్యాకే విచారణకు వస్తానని, ఈ రోజు విచారణకు రాలేనని సీబీఐకి అవినాష్ మరో లేఖ రాశారు. కానీ, అవినాష్ రెడ్డి కోసం కర్నూలులో విశ్వభారతి ఆసుపత్రికి సీబీఐ అధికారులు చేరుకున్నారు.
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చన్న ప్రచారం జోరందుకోవడంతో ఆసుపత్రి వద్దకు భారీగా వైసీపీ శ్రేణులు తరలివస్తున్నాయి. ఆసుపత్రి గేటు వద్ద వైసీపీ కార్యకర్తలు, అవినాష్ అనుచరులు బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్ద భారీ సంఖ్యలో పోలీసులును మోహరించారు. ఈ క్రమంలోనే అవినాష్ తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ ను విశ్వభారతి వైద్యులు విడుదల చేశారు.
ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు. ఆమె ఏమీ తినలేకపోతున్నారని అన్నారు. లోబీపీ ఉందని వెల్లడించారు. ఆమె మెదడుకు, పొత్తికడుపుకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాల్సి ఉందని తెలిపారు. క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స అందిస్తున్నామని, మరికొన్ని రోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉండాలని తెలిపారు. ప
ఈ క్రమంలోనే తాజా పరిణామాలను సీబీఐ అధికారులు ఎప్పటికప్పుడు ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్ కు తెలియజేస్తున్నారు. మరోవైపు అవినాశ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారా? లేక మరోసారి నోటీసులు ఇస్తారా? అనే విషయంలో సందిగ్ధత ఏర్పడింది.