అవును బీజేపీ చీఫ్ సోమువీర్రాజు చేసిన తాజా వ్యాఖ్యలు అలానే అనిపిస్తోంది. తిరుపతిలో బీజేపీ+జనసేన నేతల సంయుక్త సమావేశంలో వీర్రాజు మాట్లాడుతు కాబోయే సీఎం పవన్ కల్యాణే అంటు ప్రకటించారు. పవన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోమని స్వయంగా తనకు ప్రదానమంత్రి నరేంద్రమోడి సూచించినట్లు వీర్రాజు చెప్పటమే విచిత్రంగా ఉంది. నరేంద్రమోడి, అమిత్ షా జనసేన అధినేత పవన్ కు చాలా గౌరవం ఇస్తున్నట్లు చెప్పారు.
వీర్రాజు తాజా వ్యాఖ్యలు చూసిన తర్వాత పవన్ కు బీజేపీ బిస్కెట్లు వేస్తోందనే అనుమానాలు పెరిగిపోయాయి. ఏపికి పవనే కాబోయే సీఎం అని వీర్రాజు చెబితే ఎవరైనా నమ్ముతారా ? తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్లు తెచ్చుకుంటే అదే పదివేలు. ఈ డిపాజిట్ తెచ్చుకునేందుకే కమలంపార్టీ నేతలు నానా అవస్తలు పడుతున్నారు. మొదటినుండి ఉపఎన్నికలో పోటీ చేయటానికి జనసేన చాలా ఆసక్తిచూపింది.
అయితే ఎప్పటిలాగే విషయాన్ని చివరివరకు నానబెట్టి పవన్ నోరుమూయించి బీజేపీ నేతలే పోటీలోకి దిగుతున్నారు. పైగా ఈ విషయాన్ని పవన్ తోనే ప్రకటింపచేశారు. తెరవెనుక ఏమి జరిగిందో ఎవరికీ తెలీదుకానీ ప్రకటన చేసిన తర్వాత నుండి పవన్ కమలం నేతలతో అంటీముట్టనట్లే ఉన్నారు. చివరకు బీజేపీ రత్నప్రభను అభ్యర్ధిగా ప్రకటించినా బహిరంగంగా పవన్ కానీ లేదా పార్టీ తరపున మద్దతిస్తు ఒక్క ట్వీట్ కానీ ప్రకటన కానీ రాలేదు.
ఈ నేపధ్యంలో అసలు పవన్ ప్రచారానికి వస్తారా ? జనసైనికులు సహకరిస్తారా ? అనే విషయంలో సందిగ్దత పెరిగిపోతోంది. తిరుపతి ప్రాంతంలోని బలిజ ప్రముఖులు ఆమధ్య సమావేశమై ఉపఎన్నికలో పోటీచేసే అవకాశం జనసేనకు రాకపోతే బీజేపీకి ఓట్లేయకూడదని గట్టిగా తీర్మానించుకున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అప్పుడు బలిజ ప్రముఖుల తీర్మానం, పవన్ నుండి అధికారికంగా మద్దతు, ప్రచారం విషయం తెలియకపోవటంతో బీజేపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
అందుకనే అర్జంటుగా ఓ సమన్వయ సమావేశం అని పెట్టి కాబోయే సీఎం పవన్ అని మొదలుపెట్టినట్లు అనుమానంగా ఉంది. రత్నప్రభ, వీర్రాజు, పురంధేశ్వరి అండ్ కో స్వయంగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పవన్ తరపున అధికారికంగా ఒక్క ప్రకటన కూడా రాలేదు. దాంతోనే బీజేపీ విషయంలో పవన్ ఎంత అసంతృప్తిగా ఉన్నారో అర్ధమైపోతోంది. అందుకనే బిస్కెట్లు వేస్తున్నారనే ప్రచారం పెరిగిపోతోంది.