అమరావతిలో ఆర్-5 జోన్ భూముల వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. అ భూముల పంపిణీపై కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి రఘురామ లేఖ రాశారు. అమరావతిలో ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ స్కీం కింద ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉందని ఆ లేఖలో వివరించారు. కానీ, సుప్రీం కోర్టు తీర్పు రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టడం సరికాదని రఘురామ అన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆ స్కీం కింద రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి అంటే జగన్ కు ద్వేషం అని, రాజధానిని విశాఖకు తరలించి తాను అక్కడ ఇల్లు కట్టుకోబోతున్నానని కూడా చాలాసార్లు ప్రకటించారని ఆ లేఖలో గుర్తు చేశారు. అందుకే అమరావతిని నిర్వీర్యం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే, అమరావతిలో జగనన్న ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సహకరించవద్దని రఘురామ కోరారు. ఆల్రెడీ పంపిణీకి సిద్ధంగా ఉన్న 30 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేలా జగన్ ను ఆదేశించాలని రఘురామ కోరారు.
కాగా, అమరావతి ప్రాంతంలోని ఆర్-5 జోన్ లో జగనన్న ఇళ్ల కోసం స్థలాలు కేటాయించడంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై సుప్రీం కోర్టులో రైతులు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. హైకోర్టులో పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ తుది తీర్పునకు లోబడే పట్టాల చెల్లుబాటు ఉంటుందని, అప్పటిదాకా పట్టాదారులకు థర్డ్ పార్టీ హక్కు ఉండబోదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.