ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.. తరఫున విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆరు రోజుల పాటు రాజశ్యామ ల యాగం నిర్వహించారు. దీనికిగాను.. దాదాపు 10 కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా కర్చు చేశారు. ఈ సొమ్మంతా కూడా.. వివిధ దేవాలయాలకు(బెజవాడ దుర్గమ్మ, అన్నవరం సత్యనారాయణ స్వామి, కాణిపాకం వినాయక, శ్రీకాళహస్తి, శ్రీశైలం) చెందిన నిధుల నుంచి వెచ్చించారనేది తెలిసిందే. దీనికి సంబంధించి సర్కారు జీవో కూడా ఇచ్చింది.
అయితే.. యాగం ప్రారంభంలో మాత్రం.. ఈ యాగం రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసం.. చేస్తన్నామని.. ఇందులో ఎవరి స్వార్థం లేదని.. కేవలం రాష్ట్ర ప్రయోజనాలే ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. తాజాగా వెలుగు చూసిన ఒక క్లిప్ పరిశీలిస్తే.. ఈ యాగం ఎవరి కోసం.. ఎవరి చేత.. జరిగిందో ఇట్టే అర్థమవుఉతుంది. శత్రువులు నాశనం అయిపోవాలని.. కోర్టు కేసుల్లో సానుకూలత రావాలని.. యాగ సంకల్పం చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
యాగం పూర్ణాహుతిలో సీఎం జగన్తో రుత్విక్కులు.. రాసుకుని వచ్చిన స్క్రిప్టును చదివించారు. దీనిలో అచ్చం అదే ఉంది. ఈ రికార్డు తాలూకు క్లిప్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల పేరు చెప్పి.. వారిచ్చిన కానుకల సొమ్ముతో నీ శత్రువులు, నీ కోర్టు కేసులు పరిహరించుకునేందుకు యాగం చేసుకున్నావా? జగన్ అని ప్రశ్నించారు.
‘‘నీ శత్రువులు నాశనం అయిపోవాలి.. నీ కోర్టు కేసుల్లో సానుకూలత రావాలి… అంటూ యాగ సంకల్పం చేసి … రాష్ట్రం కోసం యాగం అని నమ్మించే గొప్పవాడివయ్యా’’ అంటూ జగన్ను ధూళిపాళ్ళ నరేంద్ర ట్వీట్ చేశారు. ‘ప్రజలారా.. ఇదిగో ఈ సంకల్పం వినండి’ అంటూ యాగ సంకల్పం చెపుతున్న వీడియోను ట్విట్టర్లో నరేంద్ర షేర్ చేశారు. ఇక ఆ యాగ సంకల్పం చెబుతున్న వీడియోలో శత్రునాశనం జరగాలని, న్యాయస్థానాల్లో విజయం లభించాలని, రాజకీయ క్షేత్రంలో విజయాలు పొందాలని జగన్ తో పండితులు సంకల్పం చెప్పించడం గమనార్హం.