టీడీపీ కీలక నేత నారా లోకేష్ నంద్యాలలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా భూమా అఖిల ప్రియ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి అన్న రీతిలో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అఖిల వర్గీయుల దాడిలో సుబ్బారెడ్డికి గాయం కావడం, ఆ తర్వాత అఖిల ప్రియను అరెస్టు చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే టీడీపీలో లుకలుకలపై అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీలో కీలక నేతల మధ్య అంతర్గత విభేదాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు…సీనియర్లతో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ఘటనపై సమగ్ర అధ్యయనం చేసి నివేదికనివ్వాలని ఆదేశించారు.. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని, ఇలా విభేదాల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.