మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చాలా ఓవర్ చేస్తున్నట్లే ఉన్నారు. సోమవారం రాత్రి నంద్యాల శివార్లలో పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డిపైన అఖిల వర్గం సడెన్ గా దాడిచేసింది. దాడిలో స్వయంగా అఖిల కూడా పాల్గొనటమే ఆశ్చర్యంగా ఉంది. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ నంద్యాల శివార్లకు చేరుకున్నారు. లోకేష్ ను కలవటానికి అఖిల, భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డితో పాటు ఆమె వర్గం చేరుకుంది. వాళ్ళు అక్కడ ఉండగానే ఏవీ తన వర్గంతో అక్కడకు చేరుకున్నారు.
ఏవీ అక్కడకు రావటమే ఆలస్యం వెంటనే అఖిల వర్గంలోని కొందరు ఏవీ వర్గంపై దాడిచేశారు. దాంతో రెండు వర్గాలు రోడ్డుమీదే కొట్టుకున్నాయి. అఖిలవర్గంలోని కొందరు డైరెక్టుగా ఏవీపైన దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఇదంతా అఖిల సమక్షంలోనే జరిగింది. ఏవీపై జరిగిన దాడిని ఆపాల్సిన అఖిల అలా చేయలేదు. పైగా ప్రత్యర్ధివర్గంపైకి అనేకసార్లు దూసుకుపోయారు. అక్కడే ఉన్న పోలీసులు రెండువర్గాలను చెదరగొట్టారు. దెబ్బలు తిన్న ఏవీని పోలీసులు నంద్యాల ఆసుపత్రికి తరలించారు. అఖిల మీద హత్యాయత్నం కేసుపెట్టిన పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
ఇక్కడ సమస్య ఏమిటంటే చాలాకాలంగా అఖిల పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్ పైన చాలా అసంతృప్తిగా ఉన్నారు. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ప్రకటించిన వీళ్ళు అఖిల ప్రియ విషయం మాత్రం ఏమీ తేల్చటంలేదు. టికెట్ ప్రకటనకు అఖిల ఎంత ఒత్తిడిపెట్టినా పని జరగటంలేదు. నియోజకవర్గంలో అఖిలకు ప్రధాన ప్రత్యర్ధిగా ఏవీ సుబ్బారెడ్డి గట్టిగా నిలబడ్డారు. మరోవైపు మాజీ ఎంఎల్ఏ భూమా బ్రహ్మానందరెడ్డి కూడా పోటీదారుగా తయారయ్యారు.
ఇదే సమయంలో పార్టీలో అఖిలను ఎవరు మాట్లాడటంలేదు. ఇలా అన్నివైపుల నుండి అఖిలను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపధ్యంలో పార్టీలో అందరిపైనా మండిపోతున్నారు. సరిగ్గా ఈ సమయంలో లోకేష్ పాదయాత్ర నంద్యాల శివార్లకు చేరుకుంది. లోకేష్ ముందు తన బలం చూపించాలన్న ఉద్దేశ్యంతో అఖిల అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో ఏవీ కూడా చేరుకోవటంతో ఆమెకు మండిపోయింది. దాంతో ఆమెవర్గం ఒక్కసారిగా ఏవీపై దాడిచేసింది. మరి అఖిల వ్యవహారాన్ని చంద్రబాబు, లోకేష్ ఏ విధంగా తీసుకుంటారో చూడాల్సిందే.