తన జీవితంలో ఎదురైన చేదు అనుభవం గురించి బయటకు వెళ్లడించారు పాపులర్ నటి భాగ్యశ్రీ. ఆమె గురించి ఇక్కడో మాట చెప్పాలి. తొంభై తొలినాళ్లలో సల్మాన్ ఖాన్ తొలిచిత్రం.. మైనే ప్యార్ కియా. ఈ సినిమాలో నటించిన భాగ్య శ్రీకి ఇదే తొలి సినిమా. ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించటమే కాదు.. అప్పటి యువతకు భాగ్యశ్రీ ఆరాధ్య దేవత అయ్యారు. ఈ సినిమా యావత్ దేశమంతా సంచలనంగా మారింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో భాగ్యశ్రీకి భారీ ఆఫర్లు వచ్చినా నో చెప్పింది. సినిమా విడుదలైనంతనే ఆమె తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడారు.
ఆమె సినిమాకు ఓకే చెబితే బ్లాంక్ చెక్ ఇచ్చేందుకు నిర్మాతలు రెఢీ అయ్యారు. కానీ.. ఆమె మాత్రం ససేమిరా అన్నారు. సినిమాలు చేయాలని తీవ్రమైన ఒత్తిడి చేయటంతో చివరకు తన భర్తను హీరోగా అయితే చేస్తానని చెప్పగా.. ఆ ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ.. సినిమాలు సక్సెస్ కాలేదు. దీంతో.. ఆమె కెరీర్ అలా నిలిచిపోయింది. తర్వాత కాలంలో ఆమె అప్పుడప్పుడు సినిమాలు చేశారు. కానీ.. పక్కా రూల్స్ తోనే. ఇటీవల ఆమె ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ లో డార్లింగ్ తల్లిగా నటించారు. హిందీలో తాజాగా రిలీజ్ అయిన ఛత్రపతిలోనూ బెల్లంకొండ శ్రీనివాస్ తల్లిగా నటించారు.
తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె షాకింగ్ ఉదంతాన్ని చెప్పారు. తొలి సినిమా తర్వాత వెంటనే సినిమాకు ఓకే చెప్పకపోవటానికి కారణం ఏమిటన్నది తాజా ఇంటర్వ్యూతో బయటకు వచ్చింది. మైనే ప్యార్ కియా రిలీజ్ అయిన కొంతకాలానికే తాను ప్రేమించిన హిమాలయ దాసానిని పెళ్లి చేసుకున్నారు. తన డెలివరీ అయిన తర్వాతి రోజు ఒక మహిళా రిపోర్టర్ తనను చూసేందుకు ఆసుపత్రికి వచ్చారన్నారు.
ఆ సందర్భంగా తనకుఎదురైన షాకింగ్ ఉదంతం గురించి చెబుతూ.. ‘ఆమె ఆసుపత్రికి వచ్చారు. నన్ను పలుకరించారు. అక్కడే నా భర్త కూడా ఉన్నారు. సల్మాన్ ఖాన్ తో మీ భార్య రిలేషన్ తో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి మీరేమంటారు? అని ప్రశ్నించింది. ఆ క్షణంలో షాక్ అయ్యాను. నా జీవితంలో అలాంటి సంఘటన ఎదురు కాలేదు. అప్పటి నుంచి ఫిలిం మ్యాగజైన్స్ చదవటం బంద్ చేశా. సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ అని అసలు విషయాన్ని చెప్పారు. సల్మాన్ గురించి మాట్లాడుతూ.. అతను చాలా మంచి వ్యక్తిఅని.. అతడితో తనకు ఎలాంటి రిలేషన్ లేదన్న ఆమె మాటల్ని విన్న తర్వాత.. మరీ అంత దారుణమైన రీతిలో క్వశ్చన్ వేసిన ఆ మహిళా రిపోర్టర్ ఎవరన్నది తెలుసుకోవాలనిపించక మానదు.