టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. నిర్విరామంగా 1200 కిలోమీటర్లపాటు లోకేష్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని బైక్ ర్యాలీలు, పాదయాత్రలు, పలు కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్ర పై వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారు. పాదయాత్ర విజయవంతంగా కొనసాగడాన్ని జీర్ణించుకోలేక లోకేష్ పై తమ అక్కసును వెళ్లగక్కారు. లోకేష్ పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్నా వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నా ప్రజలకు ఒరిగేదేమీ లేదంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరులో లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదంటూ విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైసీపీకే ప్రజలు అధికారాన్ని కట్టబెడతారని అన్నారు.
ఇక, వినుకొండలో టీడీపీ నేతలు, కార్యకర్తలు లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వాహనం ఆ పాదయాత్రకు ఎదురు వచ్చింది. ఈ సమయంలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలు నాయకులు జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారు దిగి టీడీపీ కార్యకర్తలపై రెచ్చిపోయారు.
దమ్ముంటే రావాలంటూ మీసాలు మెలేసి వీధి రౌడీలా ప్రవర్తించారు. దీంతో, అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి చేజారకుండా టీడీపీ కార్యకర్తలను అడ్డుకొని ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడ నుంచి పంపించి వేశారు.