వైఎస్ వివేకా మర్డర్ కేసు మిస్టరీ సినిమాను తలపిస్తూ మలుపుల మీద మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి దాదాపుగా అరెస్ట్ అవుతారు అనుకుంటున్న తరుణంలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడడం సంచలనం రేపింది. ఇప్పటికే అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు మూడు సార్లు విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అవినాష్ రెడ్డికి సిబిఐ అధికారులు మరో షాక్ ఇచ్చారు.
మే 16వ తేదీన హైదరాబాద్ లో విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. దీంతో, రేపు విచారణలో అవినాష్ రెడ్డిపై అధికారులు పలు కీలక ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, ఈ కేసులో ఉదయ్ కుమార్ రెడ్డిని ఇటీవల సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఉదయ్ కుమార్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా, ఆ పిటిషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించడంతో ఉదయ్ కుమార్ రెడ్డికి చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని సీబీఐ తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే విచారణ కీలక దశలో ఉన్న తరుణంలో ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది.