రాజకీయాల్లో పగలు.. ప్రతీ కారాలు ఉండకూడదన్న మాటలు ఇప్పటి రోజుల్లో చెప్పలేం. తెగే దాకా లాగకుండా.. ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి వదిలేస్తే బాగుంటుంది. దివంగత మహానేత వైఎస్ కూడా అదే చేసేవారు. తన ప్రత్యర్థులకు ఝులక్ ఇచ్చేవారే తప్పించి.. వెంటాడటం.. వేధించటం లాంటివి చేయరు. కొట్టే దెబ్బ ఏదో నేరుగా కొడతారు. అది కూడా ముందే హెచ్చరిక జారీ చేసి.. ఎంత నష్టం చేసేది చెప్పి మరీ చేసేవారు. దీంతో.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.
ఇప్పుడు అలాంటి రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో లేదు. ముఖ్యంగా.. ఏపీలో అయితే అలాంటి పరిస్థితే లేదు. తరచూ విపక్ష నేతలను టార్గెట్ చేసినట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీని వల్ల జరిగేదేమంటే.. వెంటాడారు.. వేధిస్తున్నారన్న ముద్ర ప్రభుత్వం మీద పడే ప్రమాదం ఉంది. నిజంగానే తప్పులు చేసి ఉండొచ్చు. వాటిని ఎవరు వంక పెట్టని రీతిలో ఉండాలే తప్పించి.. నిత్యం మాట్లాడుకునేలా ఉండకూడదు.
ఇక్కడో ఉదాహరణ చెబుదాం. ఎవరైనా ఒక వ్యక్తి న్యాయం కోసం.. ధర్మం కోసం అంటూ ప్రతి విషయంలో లా పాయింట్లు తీస్తూ.. ఇలా ఉండాలి? అలా చేయాలి? అంటూ ప్రశ్నలు వేయటం.. వాదించటం.. చర్యల కోసం పట్టుబడటం లాంటివి చేస్తుంటే మనమేం అంటాం? వీడెవడండి.. పెద్ద గోల క్యాడెంట్ అనుకుంటామా? లేదా? అతను చెసేది ఎంత కరెక్టు పని అయినప్పటికీ ఆ తీరు కాస్తంత విసుగ్గా ఉంటుంది. అలాంటిది ఒక ప్రభుత్వం అదే పనిగా అలా చేస్తే ఎలా ఉంటుంది.
తాజాగా ఉండవల్లిలో విపక్ష నేత చంద్రబాబు అద్దెకు ఉండే గెస్టు హౌస్ ను ప్రభుత్వం అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి కొన్ని మీడియాలో.. చంద్రబాబు గెస్టు హౌస్ అంటూ ఉదరగొట్టేయటం కనిపించింది. నిజానికి అది చంద్రబాబు అద్దెకు తీసుకున్న నివాసం. ఈ కారణంతోనే కదా.. రాజధాని అమరావతి అన్ని మాటలు చెప్పిన చంద్రబాబు.. సొంతిల్లు హైదరాబాద్ లో కట్టుకున్నారే తప్పించి అమరావతి ప్రాంతంలో కానీ.. చుట్టుపక్కల ప్రాంతంలో కానీ కట్టించికోలేదన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఓవైపు అద్దె ఇల్లు అని చెబుతూనే.. తాజాగా.. ఆ అద్దెకు ఉండే ఇంటిని సైతం అటాచ్ చేయాలనుకునే తీరు.. బాబుకు సానుభూతిని పెంచేలా చేసి.. జగన్ సర్కారుకు మైనస్ గా మారే వీలుందని చెప్పాలి.
రాహుల్ మీద అనర్హత వేటు పడిన తర్వాత.. ఆయన నివాసం ఉండే అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ తాఖీదులు పంపిన వైనంపై మోడీ సర్కారుకు ఎంత నష్టం వాటిల్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలాంటి నష్టమే జగన్ సర్కారుకు ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూదు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో.. విపక్షాలను వెంటాడి.. వేధిస్తున్నారన్న భావన ప్రజల్లోకి వెళ్లేలా చేయకూడదు. దానికి బదులుగా తప్పులు చేస్తున్నారు.. అందుకు తగ్గ ఫలితం వెలువడుతుందన్నది ప్రచారంగా మారితే ఫర్లేదు. అందుకు భిన్నంగా అయితే మాత్రం ఇబ్బంది.
తాజా పరిణామాల్ని చూసినప్పుడు.. చంద్రబాబు అద్దెకు ఉండే లింగమనేని గెస్టు హౌస్ ను రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేయటం.. చంద్రబాబు.. మాజీ మంత్రి నారాయణలు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా పేర్కొన్న సీఐడీ.. అటాచ్ మెంట్ కు ఆదేశాల్ని జారీ చేసింది ఇలాంటివాటి విషయంలో దూకుడు ప్రదర్శించకుండా.. ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి ఐడియాలను ఇచ్చే వారిని కొంతకాలం కాస్తంత దూరం పెడితే మంచిదన్న మాట వినిపిస్తోంది.