కాలం మారింది. రోజులు మారాయి. పెళ్లి పందిట్లో అనవసర పంచాయితీ చేసే పెళ్లి కొడుకులకు గట్టిగా బుద్ది చెబుతున్న రోజులు ఇవి. గతంలో మాదిరి.. పెళ్లి పందిట్లో అలిగిన పెళ్లి కొడుక్కి సపర్యలు చేసి.. అతడి డిమాండ్లకు సరే అంటూ తలాడించేందుకు పెళ్లి కుమార్తెలు.. వారి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. నిజానికి.. పెళ్లి పందిట్లో డబ్బుల కోసం పంచాయితీ పెట్టుకునేటోడ్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇవాళ ఈ డిమాండ్.. పెళ్లి తర్వాత మరో డిమాండ్ ను పెడితే.. ఏం చేయాలి? కానీ.. ఇందుకు భిన్నంగా వ్యవహరించారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.
ఆయన చేసిన పనికి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని అంబాల్ పూర్ గ్రామ మాజీ సర్పంచ్ కుమార్తె అనూషకు సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన వినయ్ తో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి సందర్భంగా పెళ్లి కొడుకు తనకు టూవీలర్ కావాలంటూ పెళ్లి కుమార్తె తల్లిదండ్రులతో పేచీ పెట్టుకున్నాడు.
బైక్ కొనిపిస్తేనే పెళ్లి చేసుకుంటానని.. తాళి కడతానని భీష్మించాడు. దీంతో.. పెళ్లి మండపంలోని వారు షాక్ తిన్న పరిస్థితి. ఇలాంటివేళలోనే మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పెళ్లికి వచ్చారు. పంచాయతీ గురించి తెలుసుకున్న రసమయి.. పెళ్లికొడుకు వినయ్ కు నచ్చజెప్పి.. బైక్ కొనిస్తానని హామీ ఇచ్చారు.
అప్పటికప్పుడు రూ.50వేలు పెళ్లి కొడుకు చేతిలో పెట్టారు. ఈ సందర్భంగా పెళ్లి కుమార్తెను ఓదార్చారు. మిగిలిన డబ్బుల్ని షోరూంలో కడతానని చెప్పిన అనంతరం పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో తాళి కట్టారు. పెళ్లి కుమార్తెది పేద కుటుంబమని.. పెళ్లి పందిట్లో గొడవతో వివాహం ఆగిందని.. అందుకే ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. రసమయి పెద్ద మనసుకు అభినందనలు చెప్పాల్సిందే. కానీ.. ఈ ఉదంతం గురించి తెలిసిన వారు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి వేళ ఇలా పేచీ పెట్టుకునే పెళ్ళికొడుకుని ఎందుకు ఎంకరేజ్ చేయాలని ప్రశ్నిస్తున్నారు. రసమయి సీన్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకుంటే పెళ్లి ఆగేది కదా? అన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇలాంటి పెళ్లి కొడుకులకు ఈ రోజుల్లో కూడా బుద్ధి చెప్పకపోతే ఎలా? అన్న మాట వినిపిస్తోంది. నిజమే కదా రసమయి?