టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంలో పాదయాత్ర చేస్తున్నారు. మొత్తం 12 కిలో మీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్ర శుక్రవారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. అడుగడుగునా ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారు. తమ సమస్యలు చెప్పుకొంటున్నారు. చంద్రబాబు సైతం చిరునవ్వుతో వారిని పలకరించి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు పంటలు దెబ్బతిని.. చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 4, 5, 6 వ తేదీల్లో చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించి.. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ క్రమంలోనే రైతులను భరోసా ఇచ్చి.. పంటలను మూడు రోజుల్లో కొనాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. గడువులోగా పంటలు కొనని పక్షంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
అయితే పంటలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతు పోరు బాట పేరుతో శుక్రవారం పాదయాత్ర ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఇరగవరం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అయితే, చంద్రబాబు `రైతు పోరు బాట`లో తడిచిన ధాన్యాన్ని చూపించడానికి వచ్చిన రైతులను పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. దీంతో కొంత అలజడి నెలకొంది.
పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ రోడ్డుపై బైఠాయించారు. స్పందించిన నర్సాపురం డీఎస్పీ మనోహర చారి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రాధాకృష్ణ నిరసన విరమించారు. పోలీసులు అనుచిత వైఖరిని ఆరిమిల్లి ఖండించారు. పాదయాత్రను సక్రమంగా ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు.