అకాల వర్షాలకు తీవ్రంగా పంట నష్టపోయిన రైతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించిన సంగతి తెలిసిందే. రైతులను పరామర్శిస్తున్న సందర్భంగా పవన్ ప్రసంగిస్తూ తాను సెంటు భూమిలో వరి పండించానని, రైతు కష్టం తనకు తెలుసని వ్యాఖ్యానించారు. దీంతో, ఆ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా విభాగం తీవ్రంగా ట్రోలింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు రాజమండ్రిలో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ అక్కడ రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత మంగళగిరిలో జనసేన ప్రధాన కార్యాలయానికి చేరుకున్న పవన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తనను విమర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకానికి పవన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. తాను సంపూర్ణ రైతుని కాదని, వ్యవసాయం గురించి వరి రకాల గురించి తనకు కొంత మాత్రమే అవగాహన ఉందని పవన్ అన్నారు. కానీ, తాను మానవతావాదినని, ఒకరికి నష్టం వస్తుంటే ఎందుకు వస్తోంది అనేదానిపై అధ్యయనం చేయగలిగిన ఆసక్తి, శక్తి ఉన్నవాడినని పవన్ అన్నారు.
అయితే, వ్యవసాయం గురించి పూర్తి అవగాహన ఉన్న ప్రభుత్వ పెద్దలు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని పవన్ ప్రశ్నించారు. 10 రకాల పంటలు చూపిస్తే వాటిలో 5 రకాల పంటల పేర్లు కూడా తెలియనివారు చేసేవి పాప పరిహార యాత్రలని మంత్రి కాకాని చేసిన కామెంట్లకు పవన్ కౌంటర్ ఇచ్చారు. 10 రకాల పంటల గురించి తెలిసిన మంత్రులు రైతులకు ఏం న్యాయం చేశారో చెప్పాలని పవన్ నిలదీశారు.
సమస్యలు లేని చోట సమస్యలు సృష్టించే రకం తాను కాదని, సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి తాను పోరాడతానని, ప్రజల పక్షాన నిలుస్తానని పవన్ అన్నారు. ప్రభుత్వం తమకు సకాలంలో గోనె సంచులు అందించి ఉంటే బాగుండేదని రైతులు తన దగ్గర వాపోయారని పవన్ అన్నారు. తాను పర్యటనకు వస్తున్నానని తెలిసి రాత్రి గోనె సంచులు అందించారని, తడిసిన ధాన్యాన్ని కూడా కొన్నారని రైతులు వాపోయినట్టుగా పవన్ చెప్పారు.