మాజీ అమెరికా అధ్యక్షుడు.. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో ఆయన తప్పు చేసినట్లుగా నిర్దారించిన జ్యూరీ ఆయనకు భారీ జరిమానాను విధిస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు. 1990లో మాన్ హట్టన్ లోని బెర్గ్ డార్ఫ్ గుడ్ మాన్ డిపార్ట్ మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూంలో ట్రంప్ తనపై అత్యాచారం చేసినట్లుగా ప్రముఖ అమెరికా రచయిత్రి జీన్ కారోల్ చేసిన ఆరోపణ నిజమని జ్యూరీ పేర్కొంది.
ట్రంప్ తప్పు చేసినట్లుగా నిర్దారించిన జ్యూరీ ఆమెకు 5 మిలియన్ డాలర్ల మొత్తాన్ని ఫైర్ రూపంలో చెల్లించాలని పేర్కొంది. తాజాగా జ్యూరీ ఇచ్చిన ఆదేశాలు ట్రంప్ కు ఇబ్బందికరంగా మారటమే కాదు.. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆయన్ను ఇరుకున పడేసేలా చేశాయమంటున్నారు. తన తీర్పును ప్రకటించే వేళలో జ్యూరీ కీలక వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
తనను లైంగికవేధింపులకు గురి చేసిన ట్రంప్ మీద ఆమె ఫిర్యాదు చేసినప్పుడు.. అందుకు భిన్నంగా ట్రంప్ ఆమె పరువు తీశారని.. అబద్ధాలు చెప్పారని ఆరోపించారన్నారు. క్యారోల్ ను అబద్ధాల కోరుగా ట్రంప్ అభివర్ణించటాన్ని జ్యూరీ ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఇదిలా ఉంటే..ఈ తీర్పుపై ట్రంప్ అప్పీలు చేసుకుంటారని ఆయన తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. మరోవైపు బాధితురాలు కారోల్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. చివరకు ప్రపంచంలో ఈ రోజు నిజం తెలుసుకుంటోందని.. తనకు లభించిన విజయం తనకు మాత్రమేకాదు.. లైంగిక వేధింపులతో బాధ పడే ప్రతి మహిళకు ఊరట కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. జ్యూరీ ఆదేశాలపై ట్రంప్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.