ఏపీ సీఎం జగన్ పై సీపీఐ సీనియర్ నేత నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. జగన్కు దుర్యోధనుడుకు పెద్దగా తేడా లేదన్నారు. ఇద్దరూకూడా కవల పిల్లలేనని..అయితే.. దుర్యోధనుడు ముందు పుట్టి.. జగన్ ఇప్పుడు పుట్టాడని విమర్శించారు. జగన్, ప్రధాని మోడీ ఇద్దరు రహస్య బంధం కొనసాగిస్తున్నారని అన్నారు. జగన్ చరిత్ర, దుర్యోధనుడి చరిత్ర ఒకేలా ఉంటాయని వ్యాఖ్యలు చేశారు.
జగన్కు అచ్చోసిన ఆంబోతుల్లా 30 మందికి పైగా సలహాదారులు ఉన్నారని నారాయణ విమర్శించారు. రాజన్న పేరు చెప్పి ఆయనకే జగన్ మూడు నామాలు పెడుతున్నారని మండిపడ్డారు. బటన్ నొక్కితే సమస్యలు పరిష్కారం కావని హితవుపలికారు. బంకర్లలో కూర్చుని జగనన్నకు చెప్పండి అంటే ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. మోడీ నుంచి బయటకు వచ్చిన మరుక్షణం జగన్ జైలుకు వెళ్తారని.. జైలు కూడా సిద్ధంగానే ఉందని అన్నారు.
బీజేపీతో సయోధ్య ఉన్న పార్టీలతో కమ్యూనిస్టులుగా తాము జతకట్టేది లేదని నారాయణ స్పష్టం చేశారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలంటే ఇవ్వమంటున్నారని.. కేవలం ప్రైవేట్ వాళ్ళకే ఇస్తారట అంటూ సీపీఐ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీకి 30 మంది దత్త పుత్రులు ఉన్నారని.. వాళ్ళే దేశాన్ని దోచుకుంటున్నారని నిప్పులు చెరిగారు.
కేరళ ప్రభుత్వాన్ని ఏమి చేయలేక బీజేపీ చొరవతో సినిమా తీయించారని విమర్శించారు. కర్ణాటకలో గెలుపు కోసం మోడీ మతాల మధ్య చిచుపెడుతూ అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. అదానీ, మోడీ బంధాన్ని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష వేయించి అనర్హత వేటు గురయ్యేలా చేశారన్నారు. ఏపీలో అడుగడుగునా మోడీకి సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతున్నా మద్దతు ఇస్తున్నారని దుయ్యబట్టారు.