తెలంగాణ పునాదులు బలంగా ఉన్నాయని.. తెలంగాణ వాదం దానికి మరింత దన్నుగా ఉందని.. ఇటీవల కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ చాలా గంభీరంగా ప్రకటించారు. అయితే.. ఇది జరిగి రెండు మూడు రోజులు కూడా గడవక ముందే.. ఒక బాంబు లాంటి వార్త తెరమీదికి వచ్చింది. అంతేకాదు.. ఇది పెద్ద ఎత్తున సర్కారుకు సెగ పెడుతోంది. పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తికి తెలంగాణలో సీఎం కేసీఆర్ కొలువు ఇవ్వడం.. ఆయనకు నెలకు లక్షన్నర జీతం కట్టబెట్టడం వంటివి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
మన నీళ్లు, మన కొలువులు(నియామకాలు), మన నిధులు- నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అయితే.. ఇప్పుడు నీళ్ల విషయం పక్కన పెడితే.. నియామకాలు.. నిధుల విషయం తీవ్రస్తాయిలో సర్కారును కుదిపేస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన శరద్ మర్కడ్ అనే యువకుడిని తన ప్రైవేటు సెక్యూరిటీగా నియమించుకున్నారు కేసీఆర్. అంతేకాదు, ఏటా 18 లక్షల వేతనం ఇచ్చేందుకు ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇది తీవ్ర దుమారానికి దారితీసింది.
రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత అల్లాడుతుంటే.. ప్రజాధనంతో పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకునేందుకు అక్కడి మనుషులను తెచ్చుకొని ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి పార్టీలో చేరిన శరద్ మర్కట్ అనే యువకుడికి సీఎంవోలో రూ.లక్షన్నర నెల వేతనంతో ప్రైవేట్ సెక్రటరీగా నియమించారని కాంగ్రెస్ సహా బీజేపీ నేతలు దుయ్యబడుతున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను రహస్యంగా ఉంచారని కూడా చెబుతున్నారు.
ఎన్నికల ముంగిట ఈ వివాదం కేసీఆర్ను తీవ్రంగా కుదిపేస్తుందని అంటున్నారు. ఇక, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం తెలంగాణ ప్రజాధనం(నిధులు) వినియోగిస్తున్నారని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అటు ఢిల్లీలోను.. ఇటు జిల్లాల వ్యాప్తంగా కొత్త జిల్లాల్లోనూ బీఆర్ ఎస్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడాన్ని వారు తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. ఈ రెండు అంశాలు కూడా ఇప్పుడు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. పైకి బీఆర్ ఎస్ నేతలు మౌనంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఎన్నికల నాటికి నిధులు-నియామకాల వ్యవహారం సెగ పెడుతుందనే భావన వ్యక్తమవుతుండడం గమనార్హం.