వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే పార్టీకి రెబల్ గా మారిన కోటంరెడ్డి…ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాహాటంగానే టిడిపి బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇచ్చి వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ పై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.
నెల్లూరు రూరల్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్ మూడు సంతకాలు చేశారని, కానీ, ఇప్పటిదాకా నిధులు మంజూరైన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. సీఎం పెట్టిన సంతకాలకే దిక్కు లేకపోతే ఎలా అని కోటంరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ నేతలు అనవసరమైన మాటలను మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఆ అనవసర మాటలను ఆపి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయాలని సూచించారు.
తాను అధికారానికి మాత్రమే దూరమయ్యానని, ఆరోగ్యకరమైన రాజకీయాలు మాత్రం చేస్తూనే ఉంటానని అన్నారు. గతంలో కూడా తన నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం కోటంరెడ్డి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డ్రైనేజీ సమస్య ఉందన్న స్థానికుల ఆవేదనను చూసి కోటంరెడ్డి స్వయంగా డ్రైనేజీ గుంటలో దిగి దానిని క్లీన్ చేసిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. మరి, కోటంరెడ్డి తాజా వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.