కల్వకుంట్ల చంద్రశేఖర్ అనే కన్నా కేసీఆర్ అన్నంతనే ఇట్టే కనెక్టు అయిపోతారు. అలానే కల్వకుంట్ల తారక రామారావు కంటే కూడా కేటీఆర్ అన్నంతనే రాష్ట్రాలతో సంబంధం లేకుండా తెలుగు వారు ఎవరైనా ఇట్టే అర్థమైపోతుంది. మరి.. వీఎస్ రెడ్డి అనే రాజకీయ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారా? సరే.. విషయాన్ని మరింత సింఫుల్ చేసేందుకు ఏపీలో ఎవరైనా ప్రముఖుడు ఉన్నాడా? అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా అన్న పేరు.. ఈ మధ్యనే కాస్తంత గ్యాప్ వచ్చిందన్న ప్రచారం జరుగుతున్న వారిలో వీఎస్ రెడ్డి ఎవరైనా ఉన్నారా?అని అడిగతే నోరెళ్ల బెడతారు.
ఏపీ పోలీసులు అవసరానికి మించిన తెలివిని ఎలా ప్రదర్శిస్తారు? అన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా తాజా ఇష్యూను చెప్పాలి. ఇంతకీ వీఎస్ రెడ్డి అంటే ఎవరో కాదు.. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. అదేదో ఆ పేరునే కంప్లైంట్ ను ఎఫ్ఐఆర్ గా కట్టొచ్చు కదా? అన్న సందేహం రావొచ్చు. అలా చేసి ఉంటే.. ఇప్పుడు ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితే వచ్చేది కాదు. ఫిర్యాదు వచ్చినా.. రాకున్నా.. కాసింత తేడా కనిపిస్తే కేసు పెట్టేసే విషయంలో ఏపీ పోలీసులు అనుసరిస్తున్న పద్దతి ఇప్పుడు సరికొత్తగా మారింది.
అధికారపక్షానికి చెందిన వారి మీద ఫిర్యాదులు చేసినా.. కేసులు కట్టే విషయంలో ఏపీ పోలీసుల తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. చివరకు కోర్టు ఆదేశాల మేరకు కేసులు కట్టాల్సి వచ్చిన సందర్భంలో పోలీసులు అనుసరిస్తున్న విధానంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కేసులు నమోదు చేయాల్సి వస్తే.. సదరు ప్రముఖుల పేర్ల స్థానంలో పొట్టి పేర్లు పెట్టేసే కొత్త పంథాను ఏపీ పోలీసులు అనుసరిస్తున్నారు. సాధారణంగా ఒక ప్రముఖుడు కావొచ్చు.. సామాన్యుడు కావొచ్చు. ఆరోపణలు ఉన్న వారికి రెండు పేర్లతో పిలుస్తుంటే.. అలియాస్.. ఉరఫ్ అన్న పదాల్ని వాడేసి రెండు పేర్లను పెడుతుంటారు. అందుకు భిన్నంగా ఏపీ పోలీసులు విజయసాయి రెడ్డి విషయంలో వీఎస్ రెడ్డి పేరుతో ఎఫ్ఐఆర్ నమోదు చేయటం ఆసక్తికరంగా మారింది.
2021 నవంబరు 15న విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని 31వ వార్డుకు ఉప ఎన్నిక జరుగుతున్న వేళ.. 16వ బూత్ దగ్గర దొంగ ఓట్లు వేయిస్తున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లారు జనసేన నేతలు. అక్కడకు వెళ్లిన జనసేన నాయకురాలు ఎ. దుర్గతో పాటు మరికొందరు మహిళా నేతల్ని వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తమను ఎంపీ విజయసాయి.. బోయిన సునీల్ కుమార్ తమను తిట్టి.. భయపెట్టినట్లుగా జనసేన మహిళా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తమపై దాడి జరిగిందని.. స్వల్పంగా గాయాలు అయినట్లుగా పేర్కొన్నారు.
అయితే.. పోలీసులకు తాము ఫిర్యాదు చేసినా కేసు కట్టని వైనంపై విశాఖ కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేవారు. వాదనల అనంతరం బాధ్యులపై కేసు నమోదు చేయాలని కోర్టు చెప్పింది. అయినప్పటికీ కేసు కట్టలేదు విశాఖ సెకండ్ టౌన్ పోలీసు స్టేషన్ పోలీసులు. దీంతో.. ఆర్నెల్లకు కూడా కేసు నమోదు చేయలేదని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులకు నోటీసులు ఇచ్చారు. అయితే.. ఈ ఎఫ్ఐఆర్ లో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేరును వీఎస్ రెడ్డిగా.. రాష్ట్ర నెడ్ క్యాప్ ఛైర్మన్ కమ్మిల కన్నప్పరాజు పేరును కేకే రాజుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మిగిలిన ఇద్దరు నిందితుల పేర్లను మాత్రం యథాతథంగా నమోదు చేశారు. విశాఖ పోలీసులు తీరు ఇప్పుడు విమర్శలకు తావిచ్చేలా మారింది.